హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నది. 32 వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఆన్సర్ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్షలను జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఓ వర్గానికి చెందిన నిరుద్యోగులు మాత్రం జీవో 29, ఇతర అంశాలపై న్యాయపోరాటాలు చేయనున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్షీట్లను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. 20లోగా అభ్యంతరాలు తెలపాలని సూచించారు. ప్రాథమిక కీ, రెస్పాన్స్షీట్ల కోసం https:// tgdsc. aptonline. in/tgdsc వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
వరంగల్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఎండీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మొదటి విడత వెబ్ ఆప్షన్స్ ఈ నెల 13న మధ్యాహ్నం 3 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 వరకు నమోదు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ (http:// knruhs.telangana.gov.in) సందర్శించాలని వారు సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అమెరికా చదువుల సమాచారాన్ని అందించేందుకు అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్ మాదాపూర్ ఐటీసీ కోహినూర్‌లో 16న సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో యూజీ, పీజీ, డాక్టరేట్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి. యూఎస్‌లోని 80 అక్రిడిటేడ్ వర్సిటీ లు, కాలేజీల ప్రతినిధులు హాజరవుతారని, 17న చెన్నై, 18న బెంగళూరు, 19న కోల్‌కతా, 21న అహ్మదాబాద్, 22న పూణే, 24న ముంబై, 25న ఢిల్లీ ల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం https:// bit.ly/EdUSAFair24Emb లిం కును సంప్రదించాలని సూచించారు.