హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్లో సాధించిన విజయాలు, సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాలు, రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఓ లేఖను జత చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా సభ్యులెవరికీ ప్రమేయం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
తోటి సభ్యులందరూ రాజీనామాలు చేస్తున్నా తాను చేయలేదని, తనకు నేటికీ రాజకీయ పార్టీలతో ఎలాంటి అనుబంధం లేదని తెలిపారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా, భూభారతి సర్వే డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చానని, ఏ తప్పూ చేయనప్పుడు తాను టీఎస్పీఎస్సీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భావించినట్టు తెలిపారు. తన ఒక్కరి వల్ల ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాల ప్రకటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు భావించి, తన వల్ల ఎవరికీ అన్యాయం జరగొద్దనే తానిప్పుడు రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.