Group-4 Exam | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పరీక్ష శనివారం నాడు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను చెక్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగనున్నట్టు పేర్కొన్నది. పరీక్షకు నిరుడు బయోమెట్రిక్ ఉండగా, ఈసారి థంబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతీ పరీక్షాకేంద్రంలో థంబ్ యంత్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులంతా పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకొని, వేలిముద్రలు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ సూచించింది. చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థులకు పరీక్ష ముగిసిన తర్వాత వేలిముద్రలు స్వీకరిస్తారు.
పరీక్ష కేంద్రంలోకి అడుగు పెట్టడం నుంచి మొదలు కొని పరీక్ష రాయడం ప్రారంభించే వరకు ఆరు పద్ధతుల్లో అభ్యర్థిని చెక్ చేయాలని నిర్ణయించింది. పరీక్షకేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. గ్రూప్-4 పరీక్ష విధులు నిర్వర్తించనున్న సుమారు 40 వేలమంది ఇన్విజిలేటర్లకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, నిబంధనలు, ఇన్విజిలేటర్ల విధులు తదితర అంశాలపై వారికి సమగ్ర అవగాహన కల్పించారు. కాగా, మొత్తం 8,039 గ్రూప్4 ఉద్యోగాలకు, 9,51,205 దరఖాస్తులు వచ్చాయి. గురువారం నాటికి అత్యధికంగా 8.40 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొన్నారు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ జీహెచ్ఎంపీ పరిధిలో లేదంటే జిల్లా కేంద్రాల్లో మాత్ర మే పరీక్షలు నిర్వహించింది. అయితే, ఈసారి గ్రూప్-4కు దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో తాలుకాలతోపాటు కొన్ని మండల కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణలో ఈసారి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో కీలకమైన వాటిలో ప్రశ్నల జంబ్లింగ్ విధానం ఒకటి. గతంలో ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్లో జంబ్లింగ్ చేశారు. ఎక్కువ సిరీస్‌లలో ప్రశ్నపత్రాలను ముద్రించారు. దీనివల్ల మాస్ కాపీయింగ్‌కు పూర్తిగా చెక్ పెట్టొచ్చు. అదేవిధంగా, బబ్లింగ్ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్ షీటులో సరిగా బబ్లింగ్ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయరు.
గ్రూప్-4 రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పేపర్-1కు 9.45, పేపర్-2కు 2.15కే పరీక్ష గేట్లు మూసివేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో ప్రశ్నపత్రాలిస్తారు. పరీక్ష సమయంలో అరగంటకు ఓ సారి గంట మోగిస్తూ అప్రమత్తం చేస్తారు.
1) గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్‌ను పరిశీలిస్తారు.
2)రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు(ఫొటో తప్పనిసరి)
3)పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్‌లోని పేరును పరిశీలిస్తారు.
4)నామినల్ రోల్, ప్రభుత్వ ఐడీలోని ఫొటోను వెరిఫై చేస్తారు.
5)అభ్యర్థి సంతకాన్ని సరిపోలుస్తారు.
6)చివరిగా.. అభ్యర్థి వేలిముద్రలను స్వీకరిస్తారు.
గ్రూప్-4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. కొన్నిచోట్ల తాలుకా, మండల స్థాయిలోనూ పరీక్ష కేంద్రాలు ఉండటంతో బందోబస్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. పరీక్ష ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షాసమావేశాలు నిర్వహించాం. సుమారు 40 వేలమంది ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పరీక్ష కేంద్రంలో విధులు, నిబంధనలు తదితర అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించాం. ప్రతి పరీక్ష కేంద్రంలో యువతి, యువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశాం. అందుకు సరిపడా మహిళా సిబ్బందిని నియమించాం. అభ్యర్థులు రెండుగంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాళిబొట్టు, మెట్టెలు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదు. హిందూ సంప్రదాయాలను కించ పరుస్తున్నారని కొందరు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఇటువంటి అసత్య ప్రచారాల వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది.
– జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అభ్యర్థుల వివరాలు, ఫొటోతో కూడిన పర్సనలైజ్డ్ ఓఎంఆర్ షీట్‌ను టీఎస్ఎపీఎస్సీ ఉపసంహరించుకొన్నదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కమిషన్ అధికారులు తెలిపారు. మొదటి నుంచి తాము పర్సనలైజ్డ్ షీట్లను వినియోగించడం లేదని స్పష్టంచేశారు. యూపీఎస్సీ వంటి జాతీయ స్థాయి సంస్థలు కూడా సాధారణ ఓఎంఆర్ షీట్లనే వినియోగిస్తాయని వెల్లడించారు. వీటిపై హాల్‌టికెట్ నంబర్, సెంటర్ పేరు, అభ్యర్థుల ఫొటోలు ఉండవని తెలిపారు.