Group-1 Main | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మెయిన్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు మొత్తం ఏడు రోజులు పాటు నిర్వహిస్తారు. ఇందులో అర్హత పరీక్షగా జనరల్ ఇంగ్లిష్ పేపర్‌ను నిర్ణయించారు. గ్రూప్-1 మెయిన్‌లో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. గ్రూప్-1 ప్రిలిమిరీలో ఎంపికైన అభ్యర్థులు తప్పకుండా మెయిన్‌కు హాజరు కావడం తప్పనిసరి. ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు ముందుగా ఎంపిక చేసుకున్న భాషలోనే జవాబులు రాయాలి. ఒక పేపర్ తెలుగులో, మరో పేపర్ ఇంగ్లిష్ లేదా ఉర్దూలో రాసిన జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టంగా చెప్పారు. ఈ పరీక్షలను ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని, మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని గురువారం https:// www.tspsc.gov.in వెబ్సైట్లో ఉంచుతారు. ఈ నెల 17వ తేదీ వరకు వాటిని అందుబాటులో ఉంచనున్నట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం తెలిపారు. ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నాపత్రంపై ఈ నెల 17వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఆన్లైన్లో పంపాలని అభ్యర్థులకు సూచించారు.
గ్రూప్-1 ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రూప్-1లో 563 పోస్టులు ఉన్నాయి. 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్స్ పరీక్షలకు 28,150 మంది అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మాడల్ ప్రశ్నా పత్రాలు బుధవారం టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఏడు పరీక్షల మాడల్ ప్రశ్నా పత్రాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.