హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియలో వరుస తప్పిదాలే టీజీపీఎస్సీ కొంపముంచాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 రకాల తప్పలు దొర్లాయి. ఈ తప్పులే గ్రూప్ 1 ఫలితాలు, మెరిట్ లిస్టు రద్దుకు కారణమయ్యాయి. గ్రూప్ 1పై మంగళవారం హైకోర్టు అడిగిన అ నేక ప్రశ్నలకు కమిషన్ నీళ్లు నమిలింది. సరైన సమాధానాలు చెప్పలేకపోయింది. పైగా కొన్ని తప్పుడు వాదనలను కోర్టు ముందుంచింది. మరికొన్ని వివరాలను కోర్టుకు సమర్పించనేలేదు. ఇలా గ్రూప్ 1 మెయిన్స్ అనేక లోపాల పుట్టను తలపించింది. ఆఖరుకు ఫలితాల రద్దుకు దారితీసింది. ఈ కేసులో తుది తీర్పు విషయంలో హైకోర్టు అనేక తప్పులను ఎత్తిచూపింది. ప్రధానంగా 10 తప్పులను గుర్తించింది.