హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడటంపై తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) హర్షం వ్యక్తంచేసింది. ఈ బిల్లును వ్యతిరేకించాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మే రకు జాతీయస్థాయిలో అన్ని సంఘాల సమన్వయంతో పోరాడుతామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పీ రత్నాకర్‌రావు, పీ సదానందం తెలిపారు. సోమవారం అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని సోమాజిగూడలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రత్నాకర్‌రావు మాట్లాడుతూ.. విద్యుత్తు బిల్లును పలుదఫాలుగా వ్యతిరేకించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని చెప్పారు. విద్యుత్తు రంగంలో ఆపార అనుభవం గల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సేవలను అసెంబ్లీ వేదికగా కొనియాడటం పట్ల హర్షం వ్యక్తంచేశారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశమున్నందున ఇతర రాష్ట్రాలతో సంప్రదించి బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు పార్లమెంట్ లోపలా.. బయటా సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. సమావేశంలో నాయకులు ఏ వెంకటనారాయణ, జనప్రియ, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రావు, భాగయ్య, సురేశ్‌కుమార్, వెంకటేశ్, రాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.