హైదరాబాద్: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు (Semester Exams) యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యామండంలి ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీ యాజమాన్యాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని వెల్లడించింది. దీంతో నేటి నుంచి జరగాల్సిన డిగ్రీ 3, 5 సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్బా లకిష్టా రెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల డిమాండ్‌తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్టు చెప్పాయి. ప్రభుత్వం రూ.2వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
గడిచిన రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ జిట్టా బాలకిష్టారెడ్డిని కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని వారు వాపోయారు. దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరికల్లా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినా, అమలుకు నోచుకోకపోవడంతో కళాశాలలను బంద్ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో అక్టోబర్ 14 నుంచి 17 వరకు కాలేజీలు మూసివేసినప్పుడు విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారని, దాంతో తరగతులు నిర్వహించామన్నారు. అయితే అది ఇప్పటివరకు నెరవేరలేదని వెల్లడించారు.