హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లను బలోపేతం చేయటం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయంశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఏడాది విద్యార్థుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలోభాగంగా డీఈవోలు, హెచ్ఎంలు, టీచర్లకు అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. బడిబాటలో అత్యధికంగా ఎన్రోల్మెంట్ నమోదైన టాప్-3 జిల్లాలు, రాష్ట్రంలోని టాప్-10 స్కూల్స్‌ను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. ఈ మేరకు బడిబాట షెడ్యూల్, మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం విడుదల చేశారు. సర్కారు బడుల్లో చేరాలంటూ ఈ నెల 3 నుంచి 10 వరకు స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తారు. 13వ తేదీ నుంచి 30 వరకు రోజుకో కార్యక్రమం చేపడతారు. రెండేండ్ల విరామం తర్వాత ఈ ఏడాదే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరోనాతో 2020, 2011లో బడిబాటను నిర్వహించలేదు. ఏటా బడిబాటను వారం, పది రోజులే నిర్వహిస్తుండగా, ఈ ఏడాది మాత్రం నెల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. జూన్ 1, 2 తేదీల్లో బడిబాట సన్నాహక సమావేశాలను నిర్వహిస్తారు.
10వ తేదీ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్
జూన్ 3 నుంచి 10 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటింటి సర్వే నిర్వహించి, పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తారు. ఇందుకోసం ర్యాలీలు, కరపత్రాల అందజేత కార్యక్రమాలను చేపడుతారు. బడి ఈడు పిల్లలు, బాలలు, బాలకార్మికులు, బడి బయటి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్‌ను అప్డేట్ చేస్తారు. కొత్తగా చేరిన విద్యార్థులు ప్రైవేట్ నుంచి వచ్చారా? అంగన్వాడీ నుంచి వచ్చారా? అన్న వివరాలను ప్రత్యేకంగా పేర్కొనాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బడులు, మండలాలు, జిల్లాల్లో బడిబాట డెస్క్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కొత్తగా నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి రోజు www.schooledu. telangana.gov.in పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని హెచ్ఎంలు, ఎంఈవోలను ఆదేశించారు.
బడి బాట షెడ్యూల్
తేదీ : చేపట్టాల్సిన కార్యక్రమాలు
13.06.2022 : మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి
14.06.2022 : ఇంగ్లిష్ మీడియాన్ని బడుల్లో ప్రవేశపెట్టిన విషయాన్ని వివరించడం
15.06.2022 : తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం
16.06.2022 : స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
17.06.2022 : స్వయం సహాయక బృందాలతో సమావేశం
18.06.2022 : బాలికల విద్య అండ్ కెరీర్ గైడెన్స్
20.06.2022 : సామూహిక అక్షరాభ్యాసాలు
21.06.2022 : స్వచ్ఛ పక్షోత్సవం
22.06.2022 : హరితహారం
23.06.2022 : ప్రత్యేకావసరాలు గల పిల్లల నమోదు
24.06.2022 : బాల సభ నిర్వహణ
25.06.2022 : గ్రంథాలయ రోజు (చదువల మేళా)
27.06.2022 : బడి బయటి విద్యార్థుల నమోదు
28.06.2022 : ద్విభాషా పుస్తకాలపై అవగాహన కల్పించటం
29.06.2022 : డిజిటల్ ఎడ్యుకేషన్
30.06.2022 : గణితం, సైన్స్ డే