హైదరాబాద్ : మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా సన్నద్ధమైందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. సోమవారం వరంగల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో వరంగల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు అందించడంతో పాటు దిశానిర్దేశం చేశారు. మనకు ఇండ్లకు వచ్చే అతిథులను ఎలా చూస్తామో.. మేడారం జాతరకు వచ్చే ప్రయాణికుల పట్ల అలాగే వ్యవహరించాలని సూచించారు.
భక్తులకు రవాణా సదుపాయాల కల్పన విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూడాల్సిన బాధ్యతను మరువొద్దన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. రవాణాకు సంబంధించి ఎలాంటి లోటు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను వరంగల్ వరంగల్ ఎస్పీగా పని చేసిన సమయంలో మేడారానికి సేవ చేసే అవకాశం రాలేదని, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా రావడం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నానన్నారు. ‘మేడారం విత్ టీఎస్ ఆర్టీసీ’ యాప్ తీసుకురావడం మైలురాయిగా నిలుస్తుందన్నారు.
రెండు నెలల ముందే ప్రణాళిక సిద్ధం చేయడంతో మేడారంలో సేవలు విజయవంతం అవుతాయని, అమ్మవార్ల ఆశీస్సులతో సంస్థకు మంచి రోజులు రానున్నాయన్నారు. మేడారం జాతర సేవలను ఆదాయమార్గంగా చూడడం లేదని, ప్రజా రవాణా సేవగానే భావిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ మేరకు బస్సులను అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైతే వాటిని అధికారుల దృష్టికి తీసుకువచ్చి అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని కోరుతూ బేస్ క్యాంప్ వద్ద రద్దీతో ఏర్పడే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసుల సమన్వయం చేసుకోవాలన్నారు. వన దేవతలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను తిరిగి గమ్య స్థానాలకు చేర్చి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా టెలీఫోన్ డైరెక్టరీలు, క్యాప్‌లు, ఇతర కిట్లను అధికారులకు అందించారు. అనంతరం మేడారం జాతరలో టీఎస్ ఆర్టీసీ కార్యాకలాపాలపై వరంగల్ డిపో కండక్టర్ శివలీల పాడిన పాట సీడీని ఆవిష్కరించి, ఆమెను అభినందించారు.