హైదరాబాద్ జనవరి 13 (నమస్తే తెలంగాణ): ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకొన్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది. ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ పింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీలను మార్చినట్టు శుక్రవారం వెల్లడించింది. మార్చి 12న నిర్వహించాల్సిన ఎస్సీటీ ఎస్ఐ (ఐటీ అండ్ సీవో) మూడో పేపర్ పరీక్షను మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని పేర్కొన్నది. మార్చి 12న జరగాల్సిన ఎస్సీటీ ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షను మార్చి 11న నిర్వహించనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 23న జరగాల్సిన ఏఆర్, సివిల్, ట్రాన్స్పోర్టు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల జనరల్ స్టడీస్ పరీక్షను ఏప్రిల్ 30కి మార్చామని వెల్లడించింది. ఏప్రిల్ 23న ఉన్న ఎస్సీటీ పీసీ(ఐటీ అండ్ సీవో) టెక్నికల్ పేపర్ పరీక్షను ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నట్టు వివరించింది. మిగతా పరీక్షలన్నీ ముందుగా ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు.. మారిన కొత్త తేదీలను గమనించి పరీక్షలకు హాజరుకావాలని టీఎస్ఎల్పీఆర్బీ సూచించింది.
టీఎస్పీఎస్సీ అభ్యర్థన మేరకే..
మార్చి 12న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీవో) పరీక్ష, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించనున్నది. పోలీసు తుదిరాత పరీక్షలు రాయనున్న అభ్యర్థుల్లో కొందరు టీపీబీవో, ఏఎంవీఐ పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు మెయిన్స్ తేదీలను మార్చాలని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావుకు టీఎస్పీఎస్సీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో శ్రీనివాసరావు కొత్త పరీక్షా తేదీలను ప్రకటించారు.
విస్తృత ఏర్పాట్లు
పోలీసు తుదిరాత పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు టీఎస్ఎల్పీఆర్బీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాలకు 1.11 లక్షలమంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకొంటున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. మొత్తం 17,516 ఉద్యోగాల్లో 554 ఎస్సై పోస్టులకు 52,786 మంది అభ్యర్థులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులకుగాను 90,488 మంది, 614 ఆబారీ కానిస్టేబుల్ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు తుది పరీక్షలు రాయనున్నట్టు వివరించారు. ప్రిలిమినరీ, ఈవెంట్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్షలను కూడా సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నట్టు తెలిపారు.
