సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఖానాపురం గ్రామంలోని పీఏసీఎస్ కేంద్రంలో స్టాక్ వచ్చిన తర్వాత సెకన్లలోనే అయిపోవడంపై రైతులు ఆందోళనకు దిగారు. స్టాక్ వచ్చిన వెంటనే కేవలం ఒక్క నిమిషంలోనే 450 బస్తాల యూరియా ఎలా బుక్ అయిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘స్టాక్ పెట్టిన వెంటనే ఎలా అంత మొత్తం యూరియా బుక్ అవుతుంది..? యూరియా బస్తాలు నిజంగా రైతులకే అందుతున్నాయా..?’ అని రైతులు ప్రశ్నించారు. యాప్ ద్వారా బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపించారు. పీఏసీఎస్ సిబ్బంది ముందుగా పెద్ద రైతులకు సమాచారం ఇచ్చి వారితో బుక్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇవాళ వచ్చిన 450 బస్తాల స్టాక్‌లో సామాన్య రైతులకు ఒక యూరియా బస్తా కూడా అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ అధికారులు పీఏసీఎస్ కేంద్రానికి రావాలని డిమాండ్ చేస్తూ రైతులు అనంతగిరి-కోదాడ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పురుగుమందుల డబ్బాలతో నిరసన తెలిపారు. యూరియా ఇస్తారా.. పురుగుల మందు తాగి చావాలా..? అని ప్రశ్నించారు.