Telangana Minister Errabelli | హనుమకొండ, జులై 29: భారీ వానలు తగ్గు ముఖం పట్టినా ప్రకృతి సృష్టించిన బీభత్సానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. అందుకే భద్రకాళి బండ్ తెగింది. కొద్దిపాటి నష్టమే జరిగినా, వెంటనే అధికారులు అప్రమత్తమై తెగిన కట్టకు వెంటనే మరమ్మతు చేశారు. వరదలు మిగిల్చిన విషాదంలోనే పలువురు కొనసాగుతున్నారు. వరదల విషాదంలో ముగినిన వారిని ఆదుకోవాలని అధికారులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. బాధితులు పూర్తిగా ఉపశమనం పొందే వరకు అధికారులు వారి వెంట ఉండాలని, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సహాయ చర్యలు కొనసాగిస్తూ పునరావాస కేంద్రాలను నడపాలని సూచించారు.
ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, ఎవరూ భయపడాల్సిన పని లేదని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు అధికారులంతా కలిసి కట్టుగా, సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ పనులన్నింటిని కలెక్టర్లు పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు. శనివారం మంత్రి ఎర్రబెల్లి జిల్లాలోని పలు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. భద్రకాళి చెరువు కట్ట తెగిన ప్రాంతం, వడ్డేపల్లి చెరువును సందర్శించారు. తదుపరి భారీ వర్షాలతో జరిగిన నష్టాలపై హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, కూడా చైర్మన్ సుందర్ రాజు, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, కమిషనర్ రిజ్వాన్ బాషా, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరద బాధితులను కాపాడిన డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు అందచేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు వరదల పరిస్థితిపై ఆరా తీస్తూ, సహాయ చర్యలు సమర్థవంతంగా అందేందుకు కృషి చేశారని చెప్పారు. అడగకుండానే రెండు ఆర్మీ హెలీ క్యాప్టర్లను పంపించారన్నారు. గత నాలుగైదు రోజులుగా నిరంతరం పని చేస్తోన్న అధికారులకు, రెస్క్యూ టీమ్‌ల సభ్యులకు అభినందనలు తెలిపారు. వర్షాల వల్ల తలెత్తే అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరద నష్టం ప్రాథమికంగా రూ.414 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. వరంగల్ జిల్లాలో రూ.89 కోట్లు. హనుమకొండ జిల్లాలో రూ.146 కోట్లు, వరంగల్ మహానగరంలో రూ.179 కోట్లుగా నిర్ధారించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. 36 పునరావాస కేంద్రాల ద్వారా 4వేల 668 మందికి సహాయం అందించామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లు 207, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు 480 ఇండ్లుగా అధికారులు లెక్కించారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. త్వరలోనే వరద బాధితులకు పరిహారం చెల్లించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.
వరదలను కూడా రాజకీయాలకు వాడుకోవద్దని విపక్షాలకు మంత్రి ఎర్రబెల్లి హితవు చెప్పారు. చేతనైతే బాధితులకు సాయంగా నిలవాలే తప్ప, అవసర రాద్ధాంతాలకు పోవద్దన్నారు. వరద బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో కొందరు పలు పార్టీల పేరుతో వచ్చి రాజకీయం చేస్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడవద్దన్నారు.