TS Liquor Shop Tenders | రాష్ట్రవ్యాప్తంగా త్వరలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆశావహులు ఈ ఏడాది పోటీపడ్డారు. దరఖాస్తుల చివరి రోజైన శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. దరఖాస్తుల చివరి రోజున 56,980 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 43శాతం వచ్చాయి. గురువారం 30,469 దరఖాస్తులు రాగా.. రెండురోజుల్లోనే 87వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దుకాణాల కేటాయింపునకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది.
భారీగా దరఖాస్తుదారులు కార్యాలయాల వద్ద బారులు తీరడంతో దరఖాస్తుల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. ఒక్కో మద్యం దుకాణానికి దాదాపు 50 మంది వరకు పోటీపడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సరూర్నగర్లో 10,908 దరఖాస్తులు రాగా.. శంషాబాద్లో 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్లో 967, ఆ తర్వాత ఆదిలాబాద్లో 979 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 21న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.