సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:11

టీఎస్‌ఐపాస్‌ అద్భుతం

టీఎస్‌ఐపాస్‌ అద్భుతం

  • వివరాలిస్తే అధ్యయనంచేస్తాం
  • కేంద్రమంత్రి గోయల్‌ ప్రశంస
  • పారిశ్రామిక వసతులతోనే నిజమైన ఆత్మనిర్భర్‌
  • రాష్ట్రంలో జాతీయ ప్రాధాన్యమున్న పరిశ్రమల అభివృద్ధి 
  • ‘వన్‌ డిస్ట్రిక్‌ -వన్‌ ప్రొడక్ట్‌ కార్యక్రమం’లో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్‌ఐపాస్‌ను కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ ప్రశంసించారు. ఈ విధానానికి సంబంధించి సమగ్రసమాచారం తమకు అందించాలని కోరారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ‘వన్‌ డిస్ట్రిక్ట్‌  వన్‌ ప్రొడక్ట్‌' కార్యక్రమంపై గురువారం రాష్టాల పరిశ్రమలశాఖ మంత్రులతో గోయల్‌ వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ, భారత్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ఆత్మనిర్భర్‌ కావాలంటే భారీగా వసతులు కల్పించాలన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం చేపడుతున్న భారీ పారిశ్రామిక పార్కులకు కేంద్ర ప్రభుత్వం సాయమందించాలని కోరారు. ఆరేండ్లుగా తమ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ విధానం ద్వారా భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్‌ హైదరాబాద్‌ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్దవైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, హైదరాబాద్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్కులను అభివృద్ధిచేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వీటి అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. 


వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరం భారతదేశంలో బల్క్‌ డ్రగ్‌ క్యాపిటల్‌గా ఉన్నదని, దీంతోపాటు పెద్దఎత్తున వ్యాక్సిన్లను తయారుచేస్తూ ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా ఎదుగుతున్నదని మంత్రి కేటీఆర్‌ వివరించారు. లైఫ్‌సైన్సెస్‌, ఫార్మారంగంలో మరింత అభివృద్ధికి అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం చిన్న  జిల్లాలను ఏర్పాటుచేసిన నేపథ్యంలో కేంద్ర పరిశ్రమలశాఖ చర్చించిన ఒక జిల్లా ఒక ప్రొడక్ట్‌ కార్యక్రమానికి సంబంధించి తన అభిప్రాయాలను సవివరంగా వ్యక్తీకరిస్తామని తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.


logo