హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం ఉదయం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు నివేదిక సమర్పించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 907 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మించి వేడుకలు నిర్వహించిన వారిపై 263 కేసులు నమోదు చేశామన్నారు.
గత నెల 24 నుంచి జనవరి 2 వరకు మాస్కులు ధరించని 16,430 మందికి జరిమానా విధించామని పేర్కొన్నారు. జూన్ 20 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు 5,10,837 మందికి జరిమానా విధించినట్లు డీజీపీ కోర్టుకు తెలిపారు. కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదన్నారు. జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనా పరిస్థితులపై విచారణను ఈ నెల 7కు కోర్టు వాయిదా వేసింది.