హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పకడ్బందీగా అమలవుతున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారని హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గుడుంబా, పేకాట క్లబ్బులు, మాదక ద్రవ్యాలను నిర్మూలించారు. మత ఘర్షణలకు తావు ఇవ్వడం లేదన్నారు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపడంలో ప్రభుత్వం రాజీలేని వైఖరిని అవలంభిస్తోందని స్పష్టం చేశారు.
పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తుండటంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తున్నాయి. దీంతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంతకంతకూ మెరుగవుతుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. పోలీసు వ్యవస్థకు ఆధునిక సాంకేతి విజ్ఞానాన్ని సమకూర్చామన్నారు. ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రతి పోలీసు స్టేషన్ నిర్వహణకు నెలకు రూ. 75 వేలు అందజేస్తున్నామని తెలిపారు. గత ఆరేండ్లలో 28,288 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. పోలీసు నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ బడ్జెట్లో పోలీసు శాఖకు 9,315 కోట్లు కేటాయించామని హరీశ్‌రావు తెలిపారు.