హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మొదటి డోస్ వేశామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే 100 శాతం మొదటి డోస్ వేసిన మొదటి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. వైద్యసిబ్బందికి పురపాలక, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది సహకరించటం వల్లే రికార్డు సాధించగలిగామని వివరించారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయా శాఖల సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి డోసు వంద శాతం పూర్తయిన సందర్భంగా కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన 2.77 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశామని చెప్పారు. వంద శాతం మొదటి డోస్ పూర్తిచేసిన మొదటి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలవటం అందరికీ గర్వకారణమని అన్నారు. రాష్ర్టానికి ఎక్కువగా కొవిషీల్డ్ టీకాలు వచ్చాయని, రెండో డోస్‌కు ఎక్కువ వ్యవధి ఉండటంతో రాష్ట్రంలో సెకండ్ డోస్ కవరేజీ కాస్త తక్కువగా ఉన్నదని వివరించారు. ఏఎన్ఎంలు, ఆశావరర్లు, ఇతర వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్లు వేస్తున్నారని చెప్పారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లలకు ముందుగా మున్సిపాలిటీల్లో..
రాష్ట్రంలోని 15-18 ఏండ్లలోపు పిల్లలకు వచ్చే నెల 3 నుంచి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. మొత్తం 22.78 లక్షల మంది ఉన్నారని, ముందుగా హైదరాబాద్‌తోపాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో టీకాలు వేస్తామని అన్నారు. డాక్టర్ పర్యవేక్షణ ఉండేలా పీహెచ్సీ, ఆ పైస్థాయి దవాఖానల్లో మాత్రమే టీకాలు వేయనున్నట్టు వెల్లడించా రు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. 2007 డిసెంబర్ 31కి ముందు పుట్టినవారు టీకాలకు అర్హులని వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ వారియర్లు, 60 ఏండ్లకు పైబడినవారికి వచ్చే నెల 10 నుంచి మూడో డోస్ వేస్తామని చెప్పారు. వృద్ధుల్లో కోమార్బిడ్స్ ఉన్నవారికి మాత్రమే టీకాలు వేయాలని కేంద్రం చెప్తున్నదని, ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేలా లేఖ రాయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసులు 62కు పెరిగాయని మంత్రి హరీశ్ తెలిపారు. వీరిలో46 మంది టీకా వేసుకోలేదని, 14 మంది రెండు డోసులు వేసుకొన్నారని, ఇద్దరు ఒకే డోస్ వేసుకొన్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలని కోరారు. వరంగల్ ఎంజీఎంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్‌లో మొదటిసారిగా గుండె చికిత్స జరిగిందని తెలిపారు. ఎంజీఎం డాక్టర్లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.
కేంద్ర ఉద్యోగాల్లో ప్రతి ఐదింటిలో ఒకటి ఖాళీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఐదింటిలో ఒకటి ఖాళీగా ఉన్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వాటిని ఎందుకు భర్తీ చేయటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 8,72,243 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఈ ఏడాది జూలైలో రాజ్యసభలో ప్రకటించారు. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు? దేశం కోసం ధర్మం కోసం ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి’ అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
ఇదేనా డబుల్ ఇంజిన్ గ్రోత్?
వైద్యరంగంలో కేంద్రం ఏమాత్రం సహకరించకపోయినా, సీఎం కేసీఆర్ అద్భుత సారథ్యం వల్ల తెలంగాణ అద్భుతాలు సాధిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్‌లో నీతి ఆయోగ్ ఈ విషయాన్ని స్పష్టంచేసిందని అన్నారు. ఓవరాల్ ర్యాంకింగ్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని, గతేడాదితో పోల్చితే పురోగతి సాధించటంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ నెల 13న యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే సందర్భంగా కేంద్రం మూడు అవార్డులు ప్రకటిస్తే తెలంగాణకు రెండు అవార్డులు వచ్చాయని చెప్పారు. వైద్యంపై తలసరి ఖర్చు విషయంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని పార్లమెంట్లో స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ఒక్కో వ్యక్తిపై రూ.1,698 ఖర్చు చేస్తున్నదన్నారు. కేంద్రం తెలంగాణకు అవార్డులే తప్ప రివార్డులు ఇవ్వడం లేదని మంత్రి విమర్శించారు. మెడికల్ కాలేజీల మంజూరుతోపాటు ఇతర అంశాల్లో తెలంగాణకు సహకరించడం లేదని ఆరోపించారు. నీతిఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అట్టడుగున నిలిచిందని.. బీజేపీ చెప్పే డబుల్ ఇంజిన్ గ్రోత్ ఇదేనా? అని ఎద్దేవా చేశారు.