హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎడ్‌సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది ఎడ్‌సెట్‌లో 82.5శాతం అమ్మాయిలు అర్హత సాధించారు. మొత్తం 30,580 మంది క్వాలిఫై అయితే వారిలో 25,246 (82.5శాతం) మంది అమ్మాయిలు కావడం గమనార్హం. 5,334 (17.5శాతం) మంది అబ్బాయిలు మాత్రమే క్వాలిఫై అయ్యారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా సఫిల్‌గూడకు చెందిన అభిషేక్ మహంతి మొదటి ర్యాంకు సాధించారు. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 96.84శాతం విద్యార్థులు అర్హత సాధించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్‌రావు, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ, కో కన్వీనర్ డాక్టర్ పారిపల్లి శంకర్, అడ్మిషన్స్ కన్వీనర్ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
బీటెక్.. టూ.. బీఈడీ..
ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులతో పాటు, ఇంజినీరింగ్, బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సుల్లోని విద్యార్థులు కూడా బీఈడీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు 1,555 మంది బీఈ/బీటెక్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,122 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,120 విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. బీబీఏ 129, బీబీఎం 77, బీసీఏ 61 మంది విద్యార్థులు అర్హత సాధించారు. బీఎస్సీ హోంసైన్స్ కోర్సు పూర్తిచేసిన వారు 521 మంది విద్యార్థులు పాసయ్యారు.
ఎడ్‌సెట్ రాసిన రాష్ర్టేతరులు
రాష్ట్రంలో ఈ ఏడాది ఆంధ్రా యూనివర్సిటీ పరిధి నుంచి 72 మంది విద్యార్థులు ఎడ్‌సెట్ రాయగా, ఇందులో ఒకరు మినహా అందరూ అర్హత సాధించారు. ఎస్వీ వర్సిటీ ఏరియా నుంచి 27 మంది పరీక్ష రాస్తే అందరూ క్వాలిఫై అయ్యారు. నాన్‌లోకల్ కోటాలో ఇతర రాష్ర్టాలకు చెందిన 371 ఎడ్‌సెట్ రాస్తే 364 విద్యార్థులు అర్హత సాధించారు. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను తెలంగాణకు రప్పించేందుకు ఇటీవలే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా సీట్లను 5%నుంచి 20శాతానికి పెంచారు. ఈ సీట్లను స్థానికేతరులకే కేటాయిస్తారు.
మేనేజ్మెంట్ సీట్లు ముందే భర్తీ చేయొద్దు
ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యాకోర్సుల్లో బీ -క్యాటగిరీ (మేనేజ్మెంట్ కోటా) సీట్లను నోటిఫికేషన్‌కు ముందు భర్తీ చేస్తే చర్యలు తప్పవని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకొంటున్న కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలిపారు. నోటిఫికేషన్ రాకముందే అడ్మిషన్లు తీసుకొంటే అవి చెల్లుబాటు కావని ప్రకటించారు. పలు కాలేజీలు నిబంధనలు అతిక్రమించి బీ – క్యాటగిరీ సీట్లను భర్తీ చేసినట్టు తమకు ఫిర్యాదులందుతున్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ బీ – క్యాటగిరీ అడ్మిషన్లకు సంబంధించి మూడు రోజుల్లో విధివిధానాలను ఖరారుచేస్తామన్నారు. ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోల ప్రకారమే కాలేజీలు ఈ సీట్లను భర్తీచేసుకోవాలని స్పష్టంచేశారు. విద్యార్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని లింబాద్రి సూచించారు.
గుర్తింపులేని విద్యాసంస్థల్లో అడ్మిషన్లు వద్దు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఏఐసీటీఈ గుర్తింపు లేని కాలేజీలు, విద్యాసంస్థలు, వర్సిటీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని లింబాద్రి సూచించారు. ఇలాంటి కాలేజీల్లో చదివితే ఆయా సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని సూచించారు. రాష్ట్రంలోని ఓ కాలేజీలోబీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆఫ్ క్యాంపస్, ఇతర పేర్లతో తరగతులు నిర్వహించొద్దని లింబాద్రి స్పష్టంచేశారు.