హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఉద్యోగాలు మహిళలవే అన్న భావన ఇప్పటికే స్థిరపడింది. దీనినే కొనసాగిస్తూ బీఈడీ కోర్సుల్లో ఏటా అమ్మాయిలే అత్యధికంగా చేరుతున్నారు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు అత్యధికంగా వారే హాజరవుతున్నారు. ఈ ఏడాది రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ -24 ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. ఈ ఏడాది మొత్తం 28,549 మంది అర్హత పొందగా, వీరిలో అత్యధికంగా 23,780 మంది అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలు 4,769 మంది క్వాలిఫై అయ్యారు. ఎడ్‌సెట్ -24 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ నవీన్‌మిట్టల్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మే 23న ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించారు. సంఖ్యాపరంగా తీసుకొంటే ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 83శాతం అమ్మాయిలే ఉండగా, క్వాలిఫై అయిన వారిలోను 83శాతం అమ్మాయిలే ఉండటం విశేషం. రాష్ట్రంలో 208 బీఈడీ కాలేజీలుండగా, వీటిలో 20వేలకు పైగా సీట్లున్నాయి.