హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఈ నెల 15న విడుదలకానున్నాయి. 15న ఉదయం ఫలితాలు విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఏప్రిల్ 29న ప్రారంభమైన పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలకు 93.59% విద్యార్థులు హాజరుకాగా, ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 94.04% విద్యార్థులు హాజరైనట్టు జేఎన్టీయూ అధికారుల ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మసీకి 86,762 మందికి 81,198 మంది హాజరుకాగా, 5,564 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 2,20,327 మంది దరఖాస్తు చేయగా 2,07,190 మంది పరీక్షలు రాయగా, 13,137 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.
ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలయ్యింది. ప్రాథమిక ‘కీ’తోపాటు మాస్టర్ ప్రశ్నపత్రం, విద్యార్థుల రెస్పాన్స్షీట్లను జేఎన్టీయూ అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కొ ప్రశ్నకు రూ. 500 చెల్లించి అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు. అభ్యంతరం సరైనదిగా తేలితే ఫీజు వాపస్ చేస్తారు. లేదంటే రూ. 500 కోల్పోయనట్టే. ఇక ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ‘కీ’, మాస్టర్ ప్రశ్నపత్రం, విద్యార్థుల రెస్పాన్స్షీట్లను సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తారు. విద్యార్థులు 7వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు.
మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థి అమార్థ్య ఆరోపణలు అవాస్తవమని జేఎన్టీయూ ప్రకటనలో తెలిపింది. ‘నా బదులు వాళ్లే పరీక్ష రాశారు’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తపై ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ ప్రకటనలో వివరణ ఇచ్చారు. తాము క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్నామని, ఆయా విద్యార్థి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. విద్యార్థి ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 గంటల 56 నిమిషాలపాటు పరీక్ష రాశాడని ట్రినిటి కాలేజీ చీఫ్ సూపరింటెండెంట్ వివరణాత్మక లేఖలో పేర్కొన్నట్టు డీన్‌కుమార్ తెలిపారు. సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సైతం తాము పరిశీలించామని పేర్కొన్నారు. ఎక్కడ పొరపాట్లు జరగలేదని ప్రకటనలో వెల్లడించారు.