శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 19:02:24

టీఎస్ ఎంసెట్ అర్హ‌త ప్ర‌మాణాలు స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ

టీఎస్ ఎంసెట్ అర్హ‌త ప్ర‌మాణాలు స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ

హైద‌రాబాద్ : తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్‌) 2020 అర్హత ప్రమాణాలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 45 శాతం మార్కులకు బదులుగా, ప్ర‌స్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణత, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ప్రవేశానికి అర్హులని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కనీస అర్హత మార్కులను తొలగిస్తూ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం వెలువరించింది. అంతకుముందు టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ ప్రకారం బీఫార్మసీ కోర్సు మినహా 10 + 2 లో తీసుకున్న సబ్జెక్టులలో అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు (రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం) మార్కులు పొంది ఉండాలి. 

కోవిడ్ -19 మహమ్మారి నేప‌థ్యంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌లేదు. అభ్యర్థులందరినీ పరీక్షలు నిర్వహించకుండా ఉత్తీర్ణతగా ప్ర‌క‌టించింది. టీఎస్ ఎంసెట్‌లో అర్హత సాధించిన అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కుల అర్హత ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ర్యాంకులు పొందలేకపోయారు. ఈ ప‌రిస్థితుల‌న్నింటిని క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసిన ప్ర‌భుత్వం టీఎస్ ఎంసెట్‌లో అర్హ‌త ప్ర‌మాణాల‌ను స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.