ఓదెల, జూలై 13: న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు దూర ప్రాంతాలకు కోర్టు కోసం వెళ్లకుండా ఉండేందుకు దగ్గరగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది ఓదెల, కాల్వశ్రీరాంపూర్ రెండు మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రావణ్‌కుమార్, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ శ్రీనివాస్‌రావు, జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా, హైకోర్టు అడ్వొకేట్లు బాలసాని సురేశ్‌గౌడ్, సోలాస శంకర్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.