హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): అమెరికాలో ముంచిన కంపెనీ ఇక్కడేదో అభివృద్ధి చేస్తానన్నట్టుగా బయలు దేరింది. మోసం చేసినట్టు తెలిసినా ఆహ్వానించారా., మరేదైనా కొత్తతరహా మోసానికి తెరతీయాలని అవకాశం కల్పించే పథకం రచించారోగానీ ఫ్యూచర్ సిటీ సాక్షిగా ‘ట్రంప్’కంపు దుమారం రేపుతున్నది. సొంత దేశంలో కనీస ఆదరణకే దిక్కులేని కంపెనీ తెలం గాణ రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతానని పలికిన తీరు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అక్కడింకా కేసులు, విచారణ ల్లోనే పీకల్లోతులో కూరుకున్న అధ్యక్షుల వారి ఘనకార్యపు కంపెనీ, సత్యశీల ముచ్చట్లతో ఊదరగొట్టిన విధానం ఎందుకో, ఎక్కడో తేడా కొడుతున్నట్టుగా కనిపిస్తున్నది. రేవంత్ సర్కార్ ప్రెస్టీజియస్ ఈష్యూగా నిర్వహిస్తున్న సమ్మిట్ మొదటి రోజునే ఫ్రాడింగ్ సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడి సంస్థ బాధ్యుల నిర్వాకం మీదే అందరి దృష్టిపడింది., ఇంకెన్ని ఇలాంటి ‘అద్భుతాలు’ చూడాలో అని విశ్లేషకులు చర్చించుకోవడం కనిపించింది.
యావత్ జగత్తు విస్తుపోయేలా నిర్వహిస్తున్న సమ్మిట్టా.. మజాకా!
టీఎంటీజీ అక్రమాల చిట్టా గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ర్టానికి వస్తున్నట్టుగా చెబుతున్న పెట్టుబడులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో భారీగా ఆర్థిక మోసాలకు పాల్పడిన ట్రంప్ మీడియా సంస్థ ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడికి ముందుకు రావడమే ఇందుకు మంచి ఉదాహరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థాపించిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) సంస్థ భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కంపెనీ స్థాపన, షేర్ల సేకరణ, కంపెనీల విలీనం తదితర సందర్భాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ), అక్కడి న్యాయశాఖ (డీవోజే-డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్) జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ మోసం బయటకు రావడం, వ్యవహారంపై అంతర్జాతీయ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వెలువడడంతో భారీగా దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే సంస్థ మన రాష్ట్రంలో రానున్న పదేండ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ముందుకు రావడమే ఓ విశేషం. ఈ మేరకు సోమవారం సమ్మిట్‌లో సంస్థ డైరెక్టర్ ఎరిక్ రూ.లక్ష కోట్లు పెట్టుబడిపై ప్రకటించడంతో ఒక్కసారిగా దాని ఆర్థిక మోసాలపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. అమెరికన్లను ముంచిన మీడియా మన రాష్ట్రంలో అంత పెట్టుబడి పెట్టడమేంటని తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు బేఖాతర్
టీఎంటీజీని పబ్లిక్ లిస్టింగ్‌లోకి తీసుకురావడానికి డిజిటల్ వరల్డ్ ఆక్యుజేషన్ కార్ప్ (డీడబ్ల్యూఏసీ)అనే సంస్థతో విలీనం చేయాలని నిర్ణయించి స్పాక్ (స్పెషల్ పర్పస్ ఆక్యుజేషన్ కంపెనీ- ఒక ప్రత్యేక ప్రయోజనంతో ఏర్పాటుచేసే కొనుగోలు సంస్థ) మోడల్‌ను ఎంచుకుని తప్పుడు సమాచారంతో షేర్ల ధరలు ఒకరోజులో 800 శాతం పెంచుకుంది. విలీన ప్రక్రియకు ముందుకు రెండు కంపెనీలు రహస్య చర్చలు జరుపకూడదనే నిబంధన ఉన్నా టీఎంటీజీ, డీబ్ల్యూఏసీ చర్చలు జరిపినట్టు ఎస్ఈసీ దర్యాప్తులో తేలింది.
లక్షల డాలర్ల జరిమానా
అక్రమాలు వెలుగుచూడడంతో డీడబ్ల్యూఏసీ సంస్థ ఎస్ఈసీతో సెటిల్మెంటుకు అంగీకరించి లక్షల డాలర్లు జరిమానా చెల్లించినా నేటికీ ఒకవైపు దర్యాప్తు జరుగుతూనే ఉండగా, మరోవైపు టీఎంటీజీపై డీఓజే పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. కేసు కారణంగా ట్రూత్ మీడియా (ట్రూత్ సోషల్ ప్లాట్ ఫారమ్ టీఎంటీజీకు అనుబంధ సంస్థ) పెద్దగా యూజర్ బేస్‌ను సంపాదించలేకపోగా కేసు విషయం పొక్కిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమైంది. స్టాక్ మారెట్లో దాని షేర్లు భారీగా పతనమై పెట్టుబడిదారులు కోట్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నారు. రాజకీయంగా ట్రంప్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
జాగ్రత్తలు పాటిస్తే మంచిది..
తాజాగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ మన రాష్ట్రంలో పదేండ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై పరిశ్రమవర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ట్రంప్ సంస్థ మన రాష్ట్రంలో ఇంత భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఏమి ఆశిస్తున్నది ? రాష్ట్ర సర్కారు వారికి ఇస్తున్న హామీలు ఏమిటి ? అమెరికాలో జరిగినట్టు ఇక్కడ మోసాలు జరుగకుండా జాగ్రత్తలు పాటిస్తారా.. లేదా? స్టాక్ మార్కెట్ ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ప్రభుత్వం ఆలోచించి ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.