Students | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాలు చేయవద్దని ట్రంప్ సర్కారు నిర్ణయించడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు. రాష్ర్టానికి చెందిన గిరిజన విద్యార్థులు పస్తులుంటున్నారు. ట్రంప్ నిర్ణయంతో వారికి ఉపాధి లేకుండాపోయింది. దీంతో డబ్బుల కోసం తల్లిదండ్రుల వైపు దీనంగా చూస్తున్నారు. ఈ కష్టసమయంలో ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంపై విద్యార్థులు ఆశలు పెట్టుకోగా.. కాంగ్రెస్ సర్కారు మొండిచెయ్యి చూపింది.
పస్తులుంటున్నా కనికరించని ప్రభుత్వం
ఓవర్సీస్ పథకానికి ఎంపికైన విద్యార్థులు ఇప్పటికే అప్పులు చేసి విదేశాలకు వెళ్లారు. ఈ పథకం కింద ఇస్తానన్న రూ.20 లక్షలను కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇప్పటికే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని స్థోమతకు మించి అప్పులు చేసిన తల్లిదండ్రులకు మళ్లీ అప్పు పుట్టే పరిస్థితి లేదు. దీంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఓవర్సీస్ పథకం వైపు ఆశగా చూస్తున్నారు. కానీ, ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తారనే విషయమై ప్రభుత్వం గాని, అధికారులు గాని స్పష్టత ఇవ్వడం లేదు. విద్యార్థులు పస్తులు ఉంటున్నా కాంగ్రెస్ సర్కారు స్పందించకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ పథకం కింద గిరిజన సంక్షేమ శాఖ ద్వారా దాదాపు 157 మంది విదేశాలకు వెళ్లారని, వెంటనే వారికి నిధులు విడుదల చేయాలని సేవాలాల్ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ డిమాండ్ చేశారు.
5 వేల మంది ఎదురుచూపులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్లు పూర్తిగా నిలిచిపోయాయి. గిరిజన విద్యార్థులు మాత్రమే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనారిటీ వర్గాలకు చెందిన 5 వేల మందికి పైగా విద్యార్థులు స్కాలర్షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధి కరువైన ఈ సమయంలో తమను ఆదుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను విద్యకు దూరం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు ఉంటా యి గానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.