హైదరాబాద్, జూలై 10 (నమస్తేతెలంగాణ) : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నీతి, నిజాయితీతో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునేవారే నిజమైన జర్నలిస్టులు అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియం లో తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన ప్రసంగించారు. గతంలో అక్రెడిటేషన్ కార్డులను కొందరు అంగట్లో సరుకుగా మార్చి, దానికి విలువ లేకుండా చేశారని, ఈ చర్యవల్ల సమాజంలో దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయని శ్రీనివాస్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వీడియో జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరీశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సన్నీ, అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.