హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఫైనల్ ట్రక్‌షీట్‌ను కొనుగోలు కేంద్రంలోనే జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. రైతులెవరూ మిల్లర్లను కలవాల్సిన అవసరం లేదని, ట్రక్‌షీట్‌లో మిల్లర్లు మార్పులు చేయడానికి వీల్లేదని, ధాన్యంలో కోతలు పెట్టొద్దని స్పష్టం చేశారు. సివిల్‌సప్లయ్ భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వానకాలం ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సీజన్లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 159.15 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇందులో పౌరసరఫరాల సంస్థ 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు మద్దతు ధర రూ. 2,389 కాగా, సాధారణ రకానికి రూ. 2,369 కల్పిస్తున్నట్టు వివరించారు. డీఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా సమస్యలు ఏర్పడితే 180042500333 లేదా 1967 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. యాసంగి బోనస్ బకాయిలు రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు.