గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 18:04:16

తెలంగాణకు ఆర్థిక ఇంజిన్‌ హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌

తెలంగాణకు ఆర్థిక ఇంజిన్‌ హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: 'గతంలో తాగునీటి కోసం జలమండలి కార్యాలయాల  ముందు బిందెలు, కుండలతో ధర్నాలు ఉండేవి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యను పరిష్కరించామని' మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో  హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రగతి నివేదికను విడుదల చేసిన అనంతరం కేటీఆర్‌ ప్రసంగించారు. 

'హైదరాబాద్‌లో 25 ఏండ్లుగా ఉన్న నీటిగోసను సీఎం కేసీఆర్‌ పరిష్కరించారు. కేశవాపురం  రిజర్వాయర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2050 దాకా హైదరాబాద్‌ ప్రజలకు మంచినీటి కష్టాలు లేకుండా చేస్తున్నాం.  సీఎం కేసీఆర్‌ ముందు చూపు, ప్రణాళిక  ఉన్న నాయకుడు.  హైదరాబాద్‌లో గతంలో వారానికి రెండు రోజులు పవర్‌ హాలీడే ఉండేది.  పరిశ్రమ వాడల్లో కూడా పవర్‌ హాలీడే ప్రకటించారు. ఇప్పుడు 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తున్నామని' మంత్రి తెలిపారు. 

'ఆరేళ్లలో నగరంలో పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు. పోకిరీల పోకడలు, ఆకతాయిల ఆగడాలు లేవు. ఆరేండ్ల నుంచి హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది. దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నాడు కాబట్టే..హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి.  తెలంగాణకు ఆర్థిక ఇంజిన్‌ హైదరాబాద్‌.  హైదరాబాద్‌ బాగుంటేనే అందరూ బాగుంటరు.  నగరంలో అల్లర్లు చెలరేగితే తెలంగాణకే నష్టం.  ఏపీ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌లో రూ.5భోజనం బాగుందన్నారు' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.