ఇటీవల వచ్చిన రెండు సర్వేల్లో మొదటిది బీజేపీది, రెండోది కాంగ్రెస్‌ది. ఈ రెండు సర్వేలు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. మా లీడర్‌కు, మా పార్టీకి ప్రజల్లో బలమైన ఆదరణ ఉన్నది. టీఆర్ఎస్కు రాష్ట్రవ్యాప్తంగా పోటీ ఇచ్చే పార్టీ లేదు. ప్రజల మూడ్ చూస్తే వందకు వంద శాతం కేసీఆర్ వరుసగా మూడోసారి సీఎం కావడం తథ్యం. -మంత్రి కేటీఆర్
ప్రశాంత్ కిశోర్ చేసేవి సర్వేలు కానేకావు .. ఫీడ్‌బ్యాక్ ఇస్తారు.. పాటింపు పార్టీ ఇష్టం
పదినెలల్లో కాంగ్రెస్‌కు 3 ఎదురుదెబ్బలు.. అప్రజాస్వామ్యానికి ప్రతీక కమలం పార్టీ
‘గోలీమారో సాలోంకో’ అన్‌పార్లమెంటరీ కాదా?.. మోదీ ‘ఆందోళన్ జీవి’ అనొచ్చా?
కేసీఆర్ ఎవ్వరికీ లొంగెటోడు కాదు .. బీజేపీ ఉడుత ఊపులకు భయపడుతమా?
తెలంగాణలో పోటీ ఇచ్చే పార్టీయే లేదు.. మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించనున్నారని, ముందస్తు ఎన్నికలనేవి ఉండవని.. సరైన సమయానికే ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టంచేశారు. ఇప్పటివరకు దక్షిణభారత దేశంలో ఎవరికీ సాధ్యంకాని హ్యాట్రిక్ సీఎం అనేది కేసీఆర్ సాధించి చూపుతారని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరితమైన విధానాన్ని ఎండగడుతూనే.. తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ.. ఎలా సాగుతున్నదో వివరించారు. అంశాల వారీగా చిట్‌చాట్ ఇలా సాగింది..
టీఆర్ఎస్ హ్యాట్రిక్.. ఇది ప్రతిపక్షాల మాట
ఇటీవల వచ్చిన రెండు సర్వేల్లో మొదటిది బీజేపీది, రెండోది కాంగ్రెస్‌ది. ఈ రెండు సర్వేలు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయని చెప్పాయి. నిన్న పీసీసీ అధ్యక్షుడు మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందని, తాము పుంజుకున్నామని చెప్తున్నరు. దీన్ని బట్టి టీఆర్ఎస్సే గెలుస్తుందని మా ప్రత్యర్థులు కూడా ఒప్పుకొంటున్నారు. వాళ్లు 70 అనొచ్చు.. మేం 90 అనొచ్చు. మొత్తంగా మళ్లీ టీఆర్ఎస్దే అధికారమని ప్రత్యర్థులు అంటున్నారంటే, పరోక్షంగా మా ప్రభుత్వానికి కితాబు ఇచ్చినట్టే.
మా అంచనా ప్రకారం టీఆర్ఎస్కు 90పైగా సీట్లు ఖాయం. ప్రశాంత్ కిశోర్ చేసేవి సర్వేలు కావు.. మాకు ఫీడ్ బ్యాక్ ఇస్తారు. క్షేత్రస్థాయిలో ఆలోచన ఎట్లా ఉన్నది? ఏ కార్యక్రమానికి ఎలాంటి స్పందన ఉన్నదనేది చెప్తుంటారు. దాని ఆధారంగా మార్పులు అవసరమా? అని ఆలోచిస్తాం. వాళ్లు అడిషన్ టూల్ మాత్రమే. ప్రజల చేత మళ్లీ ఆమోదముద్ర వేయించుకొనే క్రమంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్తారు. అంతేకానీ మేం ఏం మాట్లాడాలో వాళ్లు నిర్ణయించరు. వాళ్లు సలహాలిస్తారు. పాటించాలో వద్దో పార్టీ నిర్ణయం. ఇదొక్కటే కాదు, మాకు అనేక మార్గాల నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. మొత్తానికి మా లీడర్‌కు, మా పార్టీకి ప్రజల్లో బలమైన ఆదరణ ఉన్నది కాబట్టే ప్రత్యర్థుల సర్వేలైనా టీఆర్ఎస్ విజయం ఖాయమని చెప్తున్నాయి. ప్రజల మూడ్ చూస్తే వందకు వంద శాతం కేసీఆర్ వరుసగా మూడోసారి సీఎం కావడం తథ్యం. దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఏ లీడర్ కూడా ఈ ఘనత సాధించలేదు. సీఎం కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టిస్తారన్న విశ్వాసం నాకున్నది. ఈ విశ్వసాన్ని ప్రతిపక్షాలే సర్వేల ద్వారా కల్పించినందుకు వారికి థ్యాంక్స్.
అప్రజాస్వామ్యానికి బీజేపీ ప్రతీక
బీజేపీవి అప్రజ్వామిక విధానాలని సీఎం కేసీఆర్ ఇటీవలే స్పష్టంగా చెప్పారు. పార్టీలను చీలుస్తాం, ప్రభుత్వాలను కూలుస్తాం అంటూ విర్రవీగడమే బీజేపీ అహంకారానికి, అధికార మదానికి నిదర్శనం. సీఎం కేసీఆర్ కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని మారుస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓడిస్తామని చెప్పారే తప్ప, అధికార దుర్వినియోగం చేసో, ఏజెన్సీలను అడ్డంపెట్టుకొనో కూలగొడతాం అనలేదు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఎనిమిదేండ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా ప్రజా ప్రభుత్వాలను కూల్చి గద్దెనెక్కారు. వాళ్లకు అనుకూలంగా ఉండే ఒక వ్యాపారవేత్తకు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వచ్చేందుకు, అంతకుముందే అర్హుడైన వ్యక్తిపై ఈడీని ప్రయోగించారు. ఇది అప్రజాస్వామ్యానికి నిరంకుశత్వానికి పరాకాష్ఠ. పార్లమెంటులో ఫలానా పదాలు అన్‌పార్లమెంటరీ అంటూ జాబితా ఇవ్వడం విస్మయం కలిగించింది. ఒక కేంద్ర మంత్రి గోలీమారో సాలోంకో అంటే అన్‌పార్లమెంటరీ కాదా? పార్లమెంట్లో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న ఎంపీలను మోదీ ‘ఆందోళన్ జీవి’ అంటే తప్పుకాదా? చంపండి.. నరకండి. కాల్చండి అంటే వినసొంపుగా ఉంటాయి. కరప్ట్, జుమ్లాజీవి అని వాళ్లను వర్ణించే మాటలు అన్‌పార్లమెంటరీ అట. సిగ్గుపడుతున్నా అని కూడా అనకూడదంటే ఎలా? పిల్లలు పౌష్టికాహారం తినాలని ఎవరైనా చెప్తారు. కానీ కర్ణాటకలో మాంసం, గుడ్లు వద్దని చెప్పారు. ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏం దుస్తులు వేసుకోవాలి వంటివి వాళ్లే నిర్దేశిస్తారా? మనుషుల అహారపు అలవాట్లు, అహార్యం వారు పెరిగిన వాతావరణం బట్టి మారుతుంది. దేశం మొత్తం ఒకే విధంగా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వానికి అర్థం ఏముంది? వన్ నేషన్- వన్ ఫుడ్.. వన్ నేషన్ -వన్ క్యాపిటలిస్ట్ అని అమలుచేస్తారేమో. వీళ్లకు తెలిసిన విద్య ఒకటే ‘మోడీ అండ్ ఈడీ. జుమ్లా అండ్ హమ్లా’. ఏదో ఒకటి చేసి ప్రజలను ఆగం చేయడం తప్ప ప్రజలకు మంచి పని చేసి గెలువడం వారికి తెలువదు.
ప్రజలకు అన్నీ ఇస్తాం
ప్రజల కష్టం, అవసరం సీఎం కేసీఆర్‌కు తెలుసు. ఆయన పేదల మనిషి, పేదల పక్షపాతి. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌కార్డులు తప్పకుండా ఇస్తాం. అది మా బాధ్యత. ఎప్పుడు అనేది ఆయన నిర్ణయిస్తరు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయి. రైతుబంధు కింద ఇప్పటివరకు సరైన సమయానికి రూ.58 వేల కోట్లు రైతుల ఖాతాలో పడ్డాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, ఇప్పుడు మన ఊరు-మన బడికి కూడా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నది. గతంలో కోచింగ్ సెంటర్‌కు పోతేనే సీటు వచ్చేది. ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో గత ఎనిమిదేండ్లలో వేయి మంది విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు వచ్చాయి. 973 రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నది కేసీఆర్. ఆయన ఎవ్వరికీ లొంగెటోడు కాదు. ఎవ్వరికీ బెదిరెటోడు కాదు.. కాబట్టి బీజేపీవాళ్ల ఉడత ఊపులకు భయపడెటోడు లేడు. పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ప్రపంచం బద్దలైనట్టు తొడ కొడుతూ సవాళ్లు చేస్తున్నారు. కేసీఆర్ జలసాధన మీటింగ్ పెట్టేనాటికి పార్టీ అధికారంలో లేదు. పార్టీ పుట్టిన ఏడాదిన్నరలోపే పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే వీళ్ల కంటే ఎక్కువ మంది వచ్చారు. మీటింగ్‌లు, జన ప్రదర్శనలు టీఆర్ఎస్కు కొత్త కాదు. మా వరంగల్ మీటింగ్‌తో పోలిస్తే ఇప్పటిదాకా జాతీయస్థాయిలో బీజేపీ వాళ్లు అంత పెద్ద మీటింగ్ పెట్టలేదు. వాపు చూసుకొని బలుపు అనుకోవడం కరెక్టు కాదు. రండి.. మేం ఒక మంచి పని చేస్తే, మీరు మరిన్ని మంచి పనులు చేయండి. పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోండి.
రాష్ట్రవ్యాప్తంగా మాకు పోటీ ఇచ్చే పార్టీ లేదు
టీఆర్ఎస్కు రాష్ట్రవ్యాప్తంగా పోటీ ఇచ్చే పార్టీ లేదు. నల్లగొండ, ఖమ్మం వైపు బీజేపీ సోదిలో కూడా లేదు. టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంతే. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బలమైన లీడర్లు, క్యాడర్లు ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్. కాబట్టి మాకు ప్రత్యేకంగా ప్రత్యర్థి పార్టీ లేదు. ఒక్కోచోట ఒక్కొక్కరు మా ప్రత్యర్థి. ఓ చోట బీజేపీ, మరో చోట కాంగ్రెస్.. ఇంకోచోట షర్మిల కావొచ్చు, కేఏ పాల్ కావొచ్చు. చరిత్రను పరిశీలిస్తే రాష్ట్ర విభజన జరిగితే అక్కడ బలంగా ఉన్న పార్టీలు ఖతమయ్యాయి. బీహార్ మొత్తం బలంగా ఉన్న ఆర్జేడీ, జార్ఖండ్ వేరుపడ్డాక బలహీనపడింది. ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న టీడీపీకి ఇప్పుడు ఎక్కడా ఆదరణ లేదు. తెలంగాణలో ఆ పార్టీ మనుగడే లేదు.
చేరికలు అత్యంత సహజం
రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి చేరికలు అత్యంత సహజం. సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు చెప్పారు. టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఎంతో మంది వచ్చారు, కొందరు పోయారు. టీఆర్ఎస్లో రోజూ ఎక్కడో ఒక చోట చేరికలు జరుగుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలోనే నలుగురు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇదే సమయంలో బలమైన నాయకులు పార్టీ వీడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. మేం ఆ పని చేస్తున్నాం. మాకు వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సమస్య ఉన్నచోట పరిష్కరిస్తున్నాం. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అత్యంత బలమైన నాయకుడే అభ్యర్థి అవుతారు. కాంగ్రెస్ రాబోయే పదినెలల్లో మూడు భయంకరమైన ఎదురుదెబ్బలు తినబోతున్నది. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోబోతున్నరు. దాని తరువాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరైనా మిగులుతారా?