హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనుల మనోభావాలను కేంద్ర మంత్రి దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని అవహేళన చేశారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు బుధవారం సభను స్తంభింపజేశారు. అబద్ధాలతో పార్లమెంటును తప్పుదారి పట్టించిన కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడును తక్షణమే బర్తరఫ్ చేయాలని, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును పార్లమెంటులో తక్షణమే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి నిలబడి నినాదాలు చేశారు. మంత్రిని బర్తరఫ్ చేయాలి.. రిజర్వేషన్లు పెంచాలి.. పార్లమెంటును తప్పుదారి పట్టించిన మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలి.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్‌లోకి వెళ్లారు. టీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. కేంద్ర మంత్రి వ్యవహారానికి నిరసనగా ఎంపీలు వాకౌట్ చేశారు.