నల్లగొండ: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమతా బెనర్జీని ఎం చేయలేకపోయారని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సహజం, బీజేపీ ఓడిపోవడమూ అంతే సహజమని చెప్పారు.
ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని రోజే లేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమాన్ని బీజేపీ గాలికొదిలేసిందని చెప్పారు. ఒక ఆశయంతో సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని, దానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. కేసీఆర్ చేతిలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు.