హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో కేంద్రం పచ్చి అబద్ధాలు చెప్పటం మీద టీఆర్ఎస్ ఎంపీలు భగ్గుమన్నారు. అసెంబ్లీ తీర్మానంచేసి పంపించిన బిల్లు తమకు పంపనే లేదంటూ అత్యున్నత చట్టసభతోపాటు, దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్ర గిరిజనశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడును వెంటనే బర్తరఫ్ చేయాలని బుధవారం పార్లమెంట్లో ఆందోళన చేశారు. బిశ్వేశ్వర్ టుడుపై హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసు ఇచ్చారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్రావు.. ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం కక్ష గట్టిందని ఆరోపించారు.
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై పార్లమెంట్‌ను పక్కదారి పట్టించడం అతి పెద్ద నేరమని కేశవరావు మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపితే.. అటువంటి ప్రతిపాదనేదీ లేదని బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వకంగా పేర్కొనడం ద్వారా కేంద్రం రాజ్యాంగానికి ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మంత్రిని తక్షణమే బర్తరఫ్చేయాలని డిమాండ్‌చేశారు. కేంద్ర మంత్రి పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించి, రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్నారు. తామిచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై.. కమిటీ సమావేశమై మంత్రిని బర్తరఫ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. తక్షణమే తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు.
తెలంగాణపై కేంద్రం పగ బట్టిందని నామా నాగేశ్వర్రావు విమర్శించారు. బిల్లు పంపి ఐదేండ్లు పూర్తవుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. బిల్లు ఆమోదానికి పార్లమెంటు ఉభయసభల్లో తాము అనేకసార్లు పట్టుబట్టిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణపై కేంద్రానికి అక్కసు ఉన్నదని, అందులో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
కేంద్ర మంత్రుల ప్రవర్తన చూస్తే వాళ్లు పాలించేవాళ్లా.. పీడించేవాళ్ల్లా అర్థం కావటం లేదని ఎంపీ మాలో త్ కవిత విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మం త్రి అబద్ధాలు చెప్పి తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనులంతా కలత చెందేలా చేశారని, ఈ పాపం ఊరికే పోదని మండిపడ్డారు. ఆదివాసీ, గిరిజనులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలవలేదని, కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం కూడా గిరిజనుల ఆగ్రహానికి గురై మాడి మసై పోతుందని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలను గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకోవాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదివాసీ, గిరిజనులకు పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే తక్షణమే గిరిజన రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడిచేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడుపై బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి.. పార్లమెంటరీ నిబంధనలు, లోక్‌సభ రూల్ నెంబర్ 222 ప్రకారం నోటీసు ఇచ్చారు. కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ గిరిజన రిజర్వేషన్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిన బిల్లు తమకు రాలేదని పార్లమెంట్ సాక్షిగా అబద్ధ్దాలు చెప్పారని.. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినందుకు కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీల బృందం డిమాండ్ చేసింది. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన వారిలో ఎంపీలు మాలోత్ కవిత, పోతుగంటి రాములు, వెంకటేశ్‌నేత, పసునూరి దయాకర్, గడ్డం రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ తదితరులున్నారు.