హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) తగ్గినట్టు కేంద్రం ప్రకటించింది. 2009-21 మధ్య నక్సలైట్ల హింసాత్మక కార్యక్రమాలు గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి? వాటివల్ల పరిస్థితులు ఏమేరకు మెరుగయ్యాయి? అని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు అడిగిన ప్రశ్నలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ స్పందిస్తూ.. ఎల్‌డబ్ల్యూఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్టు లిఖిత పూర్వకంగా తెలిపారు. 2009లో నక్సలైట్లు 2,258 హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని, 2021 నాటికి వీటి సంఖ్య 509కి (77 శాతం) తగ్గిందని వెల్లడించారు. వామపక్ష హింస వల్ల 2010లో దేశవ్యాప్తంగా 1,005 మంది పౌరులు, రక్షణ సిబ్బంది మరణించారని, 2021లో ఈ సంఖ్య 145కు (85 శాతం) తగ్గిందని చెప్పారు. 2018లో 126గా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రాబల్య జిల్లాల సంఖ్య 2021లో 70కి.. వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న జిల్లాల సంఖ్య 96 నుంచి 46కు తగ్గినట్టు వివరించారు. ఎల్‌డబ్ల్యూఈ ప్రాంతాల అభివృద్ధికి గత నాలుగేండ్లలో రూ.2,423.24 కోట్లతో 7,815 పనులు చేపట్టామని, తెలంగాణ నుంచి ఈ జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఉన్నదని, గత రెండేండ్లలో ఈ జిల్లాలో రూ.80.92 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
దేశంలో, ప్రత్యేకించి కొండ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ (ఎఫ్‌పీఐ)లు, మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు కేంద్రం రాయితీలు ఇస్తుందా? అని ఎంపీ నామా అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ సమాధానమిచ్చారు. 2016-17 నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సంపద్ యోజన పథకం కింద సిక్కిం సహా ఈశాన్య రాష్ర్టాలు, హిమాలయ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్టేట్ నోటిఫైడ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఐటీడీపీ) ప్రాంతాలకు రాయితీలు ఇచ్చామని తెలిపారు.