న్యూఢిల్లీ, జూలై 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సోలార్‌పార్కుల ఏ ర్పాటు, వాటి ఇన్‌స్టలేషన్‌కు కేంద్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలేమిటని లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల 40 జీడబ్ల్యూ సామర్థ్యంతో 57 పెద్ద సోలార్ పార్కులను ప్రారంభించినప్పటికీ, దేశవ్యాప్తంగా 10 జీడబ్ల్యూ మాత్రమే అమలవుతున్నదని దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. సోలార్‌పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల సేకరణలో జాప్యాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంపొందించడం కోసం కేంద్రం 50 సోలార్ పార్కులను మంజూరు చేసిందని, వీటిలో 11 పూర్తయ్యాయని, మరో ఏడు పాక్షికంగా పూర్తయ్యాయని వివరించారు. సోలార్ పార్కు ల ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాలే సేకరించాల్సి ఉంటుందని తెలిపారు.
మూసీ నది శుభ్రతకు చర్యలేవీ?, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన స్కైవేలకు ఆర్థిక సాయంపై వివరాలు చెప్పాలంటూ కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ప్రశ్నించారు. మూసీ నది హైదరాబాద్ నుంచి నల్లగొండ వరకు విస్తరించిన ప్రాంతం.. దీనిని దేశంలోని మురికి ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించరా? అంటూ అడిగారు. గురువారం లోక్‌సభలో ఎంపీల ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మూసీ, గోదావరి నదులలో మురుగునీటిని అడ్డుకోవడం, మళ్లించడం, మురుగునీటి వ్యవస్థ నిర్మాణం, మురుగునీటి శుద్ధిప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన సాయం అందిస్తుందని వివరించారు. 2014 నుంచి తెలంగాణలో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్టు లేదని, మూసీ నది కాలుష్య నివారణకు ఏ ప్రతిపాదన రాలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పై స్కెవేల నిర్మాణానికి కేంద్రం నుంచి ఏ ప్రతిపాదనను అందుకోలేదని పేర్కొన్నారు.