హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మిల్లర్లు వడ్లు తీసుకోకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కిషన్‌రెడ్డికి ధాన్యం సేకరణపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, యెగ్గె మల్లేశంతో కలిసి శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి రైస్ మిల్లర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యానికే డబ్బులు వస్తాయని, ఇందులో గోల్‌మాల్‌కు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. కిషన్‌రెడ్డికి చేతనైతే యాసంగి వడ్ల కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రూ.3 వేల కోట్ల నష్టాన్ని కేంద్రం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, దాని శవయాత్ర జరుగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూ స్థాపితం అవుతుందని అన్నారు. సీఎంపై ఇష్టారీతిగా నోరుపారేసుకొంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. టీడీపీలో ఉన్నప్పుడు తాము తెలంగాణ కోసం కొట్లాడితే, రేవంత్ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏజెంటుగా పనిచేశారని ఆరోపించారు. రేవంత్ ఏ పార్టీలో కాలుపెడితే అది ఖతమేనని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ వల్లే తెలంగాణ నాశనం
తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో, జిల్లా స్థాయి సమావేశాల్లోనూ కరెంట్ కోతలపై కాలిన మోటర్లు, స్టార్టర్లు, ఎండిన వరి కంకులతో నిరసనలు మిన్నంటేవని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లను కేంద్రం వేధిస్తూ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారని, రేవంత్‌లాంటి చిల్లరగాళ్ల వల్లే రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి రాష్ట్ర రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్.. నోరు జాగ్రత్త
సీఎం కేసీఆర్‌పై, మంత్రి కేటీఆర్‌పై ఇష్టారీతిగా నోరుపారేసుకొంటున్న రేవంత్‌రెడ్డి తీట తీసి నాలిక చీరేస్తామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించి బ్లాక్ మెయిలర్ అవతారం ఎత్తి రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ గురించి జూబ్లీహిల్స్‌లో మనుషులే కాదు.. అక్కడి రాళ్లను అడిగినా చెప్తాయని అన్నారు. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించే సభకు కాంగ్రెస్ సంఘర్షణ సభ అని పేరు పెట్టుకోవాలని సూచించారు.
డ్రగ్స్ గురించి రేవంత్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నదని విమర్శించారు. రేవంత్‌కన్నా పెద్ద డ్రగ్ అడిక్ట్ మరెవరూ లేరని అన్నారు. డ్రగ్ ముఠాలను రేవంత్ సంబంధీకులే నడుపుతున్నారని విమర్శించారు. ‘జైల్లో చిప్పకూడు తిన్న నీకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదు. కేసీఆర్, కేటీఆర్‌లపై ఇష్టారీతిగా నోరుపారేసుకుంటే బిడ్డా..రేవంత్.. నీ నాలిక చీరేస్తాం జాగ్రత్త’ అని హెచ్చరించారు. కేసీఆర్ ఉద్యమనాయకుడిగా ఉన్నప్పుడు కారులో పెట్రోల్ పోయించమని డబ్బులిస్తే అందులో కొంత కమీషన్ మిగుల్చుకున్న చరిత్ర రేవంత్‌దని ఎద్దేవా చేశారు.