ఇల్లు అమ్ముకొనొచ్చిన ఆయనకు ఇన్ని ఎకరాలు ఎక్కడివి?
బైపోల్లో డిపాజిట్ రాదు: కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్, సెప్టెంబర్ 3: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌కు మూడు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక్క మైలార్దేవ్పల్లిలోనే 400 ఎకరాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇల్లు అమ్ముకొని వచ్చిన ఈటలకు ఇన్ని ఎకరాలు ఎక్కడివో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని కౌశిక్ జోస్యంచెప్పారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘హుజూరాబాద్ అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధం.. ఇల్లందకుంట రాముడి సాక్షిగా చర్చపెడదాం.. దమ్ముంటే ముందుకురావాలి’ అని కౌశిక్‌రెడ్డి ఈటలకు సవాల్ విసిరారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఢిల్లీ నుంచి 5 వేల కోట్లు తేవాలని అడిగిన మంత్రి హరీశ్‌రావుకు సమాధానం చెప్పకుండా ఈటల పారిపోతున్నాడని ఎద్దేవాచేశారు. హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఈటల రాజేందర్‌కు లేదని చెప్పారు. ఇప్పుడు ఆయన వార్డు సభ్యుడి స్థాయికి దిగజారిపోయాడని ఎద్దేవాచేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఈటల చీకటి ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈటల రేవంత్‌కు పెద్దమొత్తంలో ముడుపులు ముట్టజెప్పాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లోనే రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌లో ఈటల గెలుస్తాడని ప్రకటించాడని గుర్తుచేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.