హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన పాటతో రైతుల్లో నూతనోత్సహం కలిగించారు. రైతులందరూ కూడి మోదీకి పాడే కట్టడం ఖాయమన్నారు. తెలంగాణ యాసంగి వడ్లను కొనే వరకు పోరాటం ఆగదన్నారు. అబద్దాలతో బీజేపీ నేతలు అందరూ సర్కాస్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకటే దేశం ఒకటే మార్కెట్ అని దళారులకు దారులేశాడు అని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో రసమయి బాలకిషన్ పాల్గొని ప్రసంగించారు.
రైతులను కేంద్రం ఆగం చేస్తుంటే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. సమైక్యవాదుల కుట్రకు బలైపోయాం. పెంచిన కరెంట్ బిల్లులను దించమని బషీర్ బాగ్లో ధర్నా చేస్తున్న రైతులపై సమైక్య పాలకులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే రైతు రాజ్యం రావాలని తెలంగాణ రాజ్యం రావాలని తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. వానమ్మా.. వానమ్మా.. ఒక్కసారన్నా వచ్చిపోవే అని పాట ఇదే వేదికపై ఉద్యమ సమయంలో పాడాను. కానీ ఇవాళ కాళేశ్వరం ద్వారా మూడు పంటలకు సరిపోయే నీళ్లను ఇస్తుంటే కేంద్రం కళ్లు మండిపోతున్నాయి. కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు చూస్తుంటే రక్తం సలసల కాగుతోంది. తూటాలకే భయపడని తెలంగాణలో వర్షాలకు భయపడుతామా? అని కేసీఆర్ ఇదే వేదికపై ఉద్యమ సమయంలో అన్నారు. అలా మమ్మల్ని ప్రోత్సహించారు. అలా తెలంగాణను సాధించారు. ఈ రాష్ట్రంలో రైతులను కన్నీళ్లు పెట్టనివ్వరు అని బాలకిషన్ స్పష్టం చేశారు. మోదీకి మూడింది అని రసమయి ఆలపించిన పాట రైతుల్లో నూతనోత్సహం కలిగించింది.