కుత్బుల్లాపూర్, ఆగస్టు19: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బండారాన్ని త్వరలోనే అన్నీ ఆధారాలతో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆయనకు భయపడేది లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం ఆయన దూలపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ అరాచకాలపై తనకు కరీంనగర్ నుంచి నిత్యం ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. బీజేపీకి చెందినవారే తనవద్దకు నేరుగా వచ్చి, వివరాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అధికారాన్ని ఉపయోగించి, తప్పుడు కేసులతో తనను జైల్లో పెట్టించేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు. జైలుకెళ్లినా సంజయ్ అరాచకాలపై పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఇప్పటిదాకా తనమీద పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని ఆరోపించారు. బండి సంజయ్ ఇలాంటి చీప్‌ట్రిక్స్ మానుకోవాలని హితవు పలికారు. దళితులపై దాడి చేశానంటూ తనపైనే ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గాల్లో దళితుల అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశానని వివరించారు. తనపై బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను దళితులే తిప్పికొడతారని చెప్పారు. తన ఇంటిపై దాడి జరిగినప్పుడు తాను ఇంట్లో లేనని, ముంబైలో ఉన్న తన కుమారుడిపై ఏ2గా కేసు పెట్టారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఇంట్లో ఉన్నట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బండి సంజయ్‌తో తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని, ఎక్కడికి వస్తాడో చెప్పాలని సవాల్ విసిరారు. తనకున్న పరిచయాల కారణంగా బీజేపీ పెద్దలను కలవడాన్ని రాజకీయం చేయడం తగదని, ఇప్పటికైనా బండి సంజయ్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.