హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బట్టేబాజ్, బక్వాస్, బడాజూటా ఎంపీ అని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి విమర్శించారు. అర్వింద్ నిజామాబాద్‌కు పట్టిన దరిద్రమని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని తానే పోలీసులకు చెప్పానని గుర్తుచేశారు. తనకు కరోనా రావడంతో దాడికి గురైన జర్నలిస్టును కలుసుకోలేకపోయానని అన్నారు. జీవన్‌రెడ్డి మంగళవారం తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగారు. అరవింద్‌ది నేరచరిత్ర, ఆ కుటుంబానిది ఘోరచరిత్ర అని ఆరోపించారు. అర్వింద్ కుటుంబం తమ స్వార్థ రాజకీయాలకోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పారు. ఒకే ఇంట్లో మూడు రాజకీయ పార్టీల కుంపట్లున్న కుటుంబమని విమర్శించారు. జర్నలిస్టు మిత్రులు బీజేపీ వలలో పడొద్దని విజ్ఞప్తిచేశారు. కరోనా వల్ల తాను ఐదు రోజులుగా ఇంట్లోనే ఉన్నానని, ఇటువంటి సమయంలో ఎంపీ అర్వింద్ అండ్ కో తనపై దుష్ప్రచారాలకు ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. గత 20 ఏండ్లుగా ఉద్యమంలో, రాజకీయాలలో జర్నలిస్టులతో కలిసి పనిచేస్తున్నానని, విలేకరులతో ఎంతో సన్నిహితంగా ఉంటానని, అలాంటిది దాడి ఎందుకు చేయిస్తానని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో జర్నలిస్టుపై తుపాకి ఎకుపెట్టి దాడిచేసిన చరిత్ర అర్వింద్‌కే ఉందని గుర్తుచేశారు. అర్వింద్ ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ (ఎఫ్ 3) ఎంపీ నుంచి బట్టెబాజ్, బక్వాస్, బడాజూటా (బీ 3) ఎంపీగా మారాడని వ్యాఖ్యానించారు. తనపై అర్వింద్ ఎన్ని అభాండాలు వేసినా నిజామాబాద్ జిల్లా ప్రజలు నమ్మరని తెలిపారు. తనకు కరోనా తగ్గిన తరువాత దాడికి గురైన జర్నలిస్టును కలిసి పరామర్శిస్తానని చెప్పారు.