హైదరాబాద్ : మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పష్టం చేశారు. శాసనసభలో సంక్షేమ పథకాల పద్దుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
గతంలో మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యారు. వైద్య, విద్య, పారిశ్రామిక, రాజకీయ, అంతరిక్ష రంగాల్లో మహిళలు విజయాలు సాధిస్తున్నారు. మహిళలు విద్యావంతులైతేనే యావత్ సమాజం బాగుపడుతుందని భావించిన కేసీఆర్.. అమ్మాయిల కోసం గురుకుల స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేశారు. కోఠి వుమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చడం గొప్ప విషయమన్నారు. పాఠశాలల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేజీ నుంచి పీజీ విద్యను అందించడమే కాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుతో బాల్యవివాహాలను నిరోధించగలిగామని చెప్పారు. ఈ పథకాల అమలుతో అమ్మాయిల తల్లిదండ్రులను ఆదుకుంటున్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్న పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. పేద పిల్లలకు ఇది ఒక వరంగా మారిందన్నారు. అమ్మ ఒడి పథకం కింద గర్భిణి, బాలింతలకు వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గూడెంలకు, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ వాహనాలు గొప్ప సేవలందిస్తున్నాయి. కేసీఆర్ కిట్‌తో శిశు మరణాలు తగ్గాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పష్టం చేశారు.