గజ్వేల్, మే 5: సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఏడేండ్ల పది నెలల కాలంలో తెలంగాణలో వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. గురువారం ములుగులోని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో తెలంగాణలో వ్యవసాయం ఏ విధంగా ఉండాలన్నది చర్చిస్తున్నామన్నారు. అందుకు అవసరమైన నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశమని చెప్పారు. దీనిలో భాగంగానే గతంలో క్యాబినెట్ సబ్‌కమిటీని తొమ్మిది మంత్రులతో వేశారని తెలిపారు.
గురువారం సుదీర్ఘంగా సాగిన సబ్ కమిటీ రెండో సమావేశంలో మంత్రులు, పరిశోధకులు, అధికారులు చాలా విలువైన సలహాలు, సూచనలు చేశారని చెప్పారు. మరిన్ని దఫాలుగా సమావేశాలు జరగాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని వాతావరణానికి అనుకూలమైన అంశాలేమైనా ఇతర రాష్ర్టాలు, విదేశాల్లో ఉంటే వాటినీ అధ్యయనం చేస్తామని చెప్పారు. మన కంటే ఉత్పత్తులు గణనీయంగా సాధించిన, అనతి కాలంలోనే పురోగతి సాధించిన, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన చైనా వ్యవసాయ రంగ అనుభవాలు, ఇజ్రాయెల్ వాటర్ మేనేజ్మెంట్ పద్ధతులను పరిశీలిస్తామని తెలిపారు.
పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అరటిపండ్లను ఎక్కువ విస్తీర్ణంలో పెంచుతున్నారన్న నిరంజన్‌రెడ్డి.. మన వద్ద అరటి విస్తీర్ణం ఏ విధంగా పెంచాలి? ఆయిల్ పామ్ సాగు తదితర అంశాలపై చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో డిమాండ్ ఉన్న పంటలే పండించాలని రైతులను కోరారు. మార్కెట్ కోసం రైతులు ఎదు రు చూడకుండా మార్కెట్టే రైతుల వద్దకు వచ్చేలా చేయాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ముందు తరాలు వ్యవసాయాన్ని ఎంతో గౌరవప్రదమైన వృత్తిగా భావించి ఆకర్షితులు కావాలని చెప్పారు. చక్కని ఉపాధి కల్పించే రంగంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దే దిశగా చర్చలు జరిగినట్టు చెప్పారు. ఆయన వెంట రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తదితరులున్నారు.