కరీంనగర్ : రాష్ట్రంలో, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మనకు కొండంత అండగా ఉంటాయని, అయితే ఇవి మాత్రమే వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని భావించరాదన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎప్పటికపుడు తిప్పికొట్టాలన్నారు. అసత్య ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలని కోరారు. గులాబీ జెండా నీడలోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యర్ధులపై యుద్ధం కొనసాగించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. మతోన్మాద బీజేపీ పార్టీ గతంలో పట్టణాలకే పరిమితమై ఉండేదని, అసత్యాలు ప్రచారం చేస్తూ, ఇప్పుడు గ్రామాలకు విస్తరించాలని చూస్తున్నారని అన్నారు. యువతను పక్కదారి పట్టించేందుకు రెచ్చగొట్టే విధంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని, ఎల్ఐసీ వంటి సంస్థలను అమ్మజూస్తున్నదని తెలిపారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని గతంలోనే ప్రారంభించారని, కేవలం రాజకీయ వేదిక కోసమే మరో సారి ఈ ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఉత్తర భారతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అరాచకాలు జరుగుతున్నాయని, మత కల్లోలాలకు ఆ పార్టీ కేంద్రంగా మారిందన్నారు. రాష్ట్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి విజయం సాధించాలని వినోద్‌కుమార్ పిలుపు నిచ్చారు.