హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు. ఉద్యోగుల వేతనాల కోసం సంఘాలు పోరాడుతూనే ఉంటాయని చెప్పారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు దేవీ ప్రసాద్, సుబ్బారావుతో కలిసిన స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వారి వాఖ్యలు ఉద్యోగుల కుటుంబాలను బాధపెడుతున్నాయని చెప్పారు.
నాడు ఉద్యోగాలు పోతాయని బెదిరించినప్పటికీ భయపడకుండా ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పారు. ఈరోజు ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని స్వామిగౌడ్ ప్రశ్నించారు. లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లినప్పుడు ఎప్పుడైనా ఓదార్చారా అని నిలదీశారు. ఆర్థిక ఒడిదొడుకులు ఉన్నప్పుడు జీతాలు ఆలస్యమవడం సహజమన్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో జీతాలు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఉద్యోగులే ప్రభుత్వానికి అండగా నిలిచారని ఆయన చెప్పారు.
తెలంగాణ కావాలనే ఆకాంక్షను ఉద్యోగులు బహిరంగంగా సమర్థించారని.. ఉద్యమాల్లో పాల్గొన్నారని, అభివృద్ధిలోనూ భాగస్వాములవుతామని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి పోడు యాత్ర చేసినప్పుడు కూడా టీఎన్జీవోలు మద్దతిచ్చారని గుర్తుచేశారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఆ పార్టీ అభిమానులు కూడా వారికి దూరమవుతారని హెచ్చరించారు.
బండి సంజయ్ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. బండి ఇలాంటి వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ నోరు జారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నుంచి బండి సంజయ్ వరకు తెలంగాణ ఆకాంక్షలపై గతంలో కామెంట్లు చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం చివరి వరకు నిలబడిన వాళ్లు టీఎన్జీవోలన్నారు. టీఎన్జీవో నేతలు ఎక్కువ మంది టీఆర్ఎస్లో ఉన్నారని బీజేపీ అక్కసని విమర్శించారు.
ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తున్న టీఆర్ఎస్కు ఓటెయ్యాలని పిలుపునిస్తే తప్పేంటని దేవీప్రసాద్ ప్రశ్నించారు. సకలజనుల సమ్మె 42 రోజులు చేస్తే బండి సంజయ్ ఏనాడు మద్దతు తెలుపలేదన్నారు. కరీంనగర్ జిల్లాలో లక్షమంది సమ్మెచేస్తే అటువైపు కూడా రాలేదని విమర్శించారు. నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాలది పేగు బంధమని, అన్నదమ్ముల బంధమని పార్టీ నాయకువు సుబ్బారావు అన్నారు.