జమ్మికుంట, మే23: ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ రాజకీయం చేయడంలో దిట్ట అని, తన ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియతో మాట్లాడారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే జమ్మికుంట పాత మార్కెట్లో రైతుబజార్‌ను రూ.1.40 కోట్లతో నిర్మించి, ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు రైతుబజార్‌కు రాని కూరగాయల వ్యాపారులకు మద్దతు పలకడాన్ని తప్పుబట్టారు. కమీషన్ల కోసమే రైతు బజార్‌ను నిర్మించాడా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఇలాంటి చౌకబారు రాజకీయం చేస్తూ వ్యాపారులను రెచ్చగొట్టడం తగదన్నారు.
ఈటల అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రైతు బజార్లోనే క్రయ, విక్రయాలు జరిగేలా ఒప్పిస్తామని చెప్పారు. దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలిచిందని, పథకం యూనిట్లు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వడం లేదని ఈటల మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ఇటీవల ఆయనే ఒక యూనిట్‌ను ప్రారంభించారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా రూ.10 లక్షలు అందిస్తున్నామని, కార్యకర్తలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యాపారులను కన్ఫ్యూజ్ చేసిన ఈటల.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.