మునుగోడులో ఉపఎన్నిక అనేక ఎన్నికల్లో ఒకటి.అక్కడ 3న పోలింగ్ జరిగింది. 6న ఫలితం వచ్చింది. టీఆర్ఎస్ పది వేల మెజార్టీతో గెలిచింది. బీజేపీ ఓడిపోయింది. ఎన్నిక జరిగి 10 రోజులు, ఫలితం వచ్చి వారం గడిచిపోయింది. దాని తర్వాత ప్రజలు, పార్టీల నేతలు ఎప్పుడో తమ పనిలో తాము పడ్డారు.మరి ప్రధాన మంత్రి మోదీని ఇంకా మునుగోడే ఎందుకు వెన్నాడుతున్నది? హైదరాబాద్ బేగంపేట సభలో ఆయన మునుగోడునే ఎందుకు పలవరించారు? ఎందుకాయన దాన్ని అంతగా గుర్తుపెట్టుకున్నారుఆ ఫలితంతో ఆయన ఏం చేయదలుచుకున్నారు?
ఇటీవలి కాలంలో రెండు మూడు సార్లు తెలంగాణకు వచ్చిన మోదీ, అప్పుడెప్పుడూ లేని విధంగా, శనివారంనాడు…కూసింత జీర కలగలసిన స్వరంతో,కళ్లు చికిలించి, కనుబొమ్మలు ఎగిరేస్తూ, పిడికిలి బిగించి, పోడియంపై గుద్దుతూ… చాలా సీరియస్‌గా… “తో మొకాబ్లా బహుత్ గ్రంగీన్ హోజాయెగా (ఐట్లెతే ఘర్షణ చాలా ఘోరంగా మారుతుంది)” ……అని ఒక్కొక్క అక్షరాన్నీ వత్తి పలుకుతూ, తర్జనిని పైకి ఎత్తి చూపిస్తూ ఎందుకు బెదిరించారు?
బేగంపేటలో ఆయన ముఖం ఎందుకంత చింతాక్రాంతమై కనిపించింది? ఏ విషయమై ఆయన అంత ఆందోళన చెందుతున్నారు? అంతరార్థం నిండిన తన మాటలతో ఎవరికి బెదిరింపు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు? ఇవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ప్రధాని తన మొత్తం పర్యటనలో ఎక్కడా జై తెలంగాణ అనలేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తే ధైర్యం చేయలేదు.
మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చి వారమైనా ప్రధాని మోదీ మది నుంచి అది ఎందుకు తొలగిపోవడం లేదు? తెలంగాణ పర్యటనలో ఆయన ఎందుకు అన్యమనస్కంగా కనిపించారు? ప్రధానినని మరిచి స్థాయికి తగని భాషను ఆయన ఎందుకు ఎంచుకున్నారు? ప్రధానిని ఆందోళనకు గురిచేస్తున్న అంశంలో మరిన్ని సంచలన వివరాలు రేపటి సంచికలో…
హైదరాబాద్, నవంబరు 12 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ఎన్నికలు- పోటీ మాత్రమే ఉంటుంది. ఎన్నికలు అయిపోయాక అందరూ కలసి ప్రజల కోసం పనిచేస్తారు. అంతే తప్ప రాజకీయాల్లో యుద్ధాలు- శత్రువులు ఉండరు. కానీ శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన మాటలు మాత్రం ఈ గీతను పూర్తిగా అతిక్రమించాయి. ‘తో మొకాబ్లా బహుత్ గ్రంగీన్ హోజాయెగా’ అనేది ఒక్కటే కాదు; ఆయన మాట్లాడిన భాష అంతా అలాంటి పదజాలంతోనే నిండి ఉన్నది. ‘…ఈ అపరాధాన్ని ఎప్పుడూ క్షమించరు’, ‘వికృత్ మానస్ లోగ్’, ‘జూట్ వ్యాపారియో’, ‘హైదరాబాద్‌లో కొందరికి ఈరోజు నిద్ర పట్టదు’… ఇలా ఆయన ఉపయోగించిన భాష, పదజాలం, నర్మగర్భంగా, బిట్వీన్ ద లైన్స్ బెదిరిస్తున్నట్టుగా సాగింది.
రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం, రైల్వేలైను, జాతీయ రహదార్లకు శంకుస్థాపన వంటి లాంఛనప్రాయ కార్యక్రమాలను పక్కనబెడితే, ప్రస్తుతం రాజకీయ పరిశీలకుల్లో, పాత్రికేయ వర్గాల్లో, సోషల్ మీడియాలో సైతం, మోదీ భాషమీదే ఎక్కువ చర్చ సాగుతున్నది. మునుగోడు ఉప ఎన్నికే కృత్రిమంగా వచ్చింది. పెద్ద స్థాయి వ్యక్తులు, అందునా ప్రధాని వంటివారు వీటిని పెద్దగా పట్టించుకోరు. ఓడిపోయిన ఎన్నిక గురించి అయితే అసలే తలువరు. కానీ తెలంగాణ పర్యటనలో మోదీ ఒకటికి రెండుసార్లు మునుగోడు గురించి ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ‘బేగంపేట సభా వేదికపైకి చేరినప్పటి నుంచే ఆయన మొహంలో ఒక ఉలికిపాటు కనిపించింది. రాగూడని చోటుకు వచ్చినప్పుడు ఉండే డిస్కంఫర్ట్లాగా ఉందది. తన సహజ శైలికి భిన్నంగా, సీరియస్ స్వరంతో, ఆగుతూ ఆగుతూ సాగిన మోదీ ప్రసంగం, ఏదో ఆక్రోశంలో ఉన్న వ్యక్తి దాన్ని దాచుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో చేసిన అక్రందనలా వినిపించింది.
గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ ప్రసంగంలోనూ, అంతకుముందు మరో రెండుసార్లు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ కనపడని ఆవేశం, ఆందోళన మోదీలో కనిపించింది’ అని వారు పేర్కొంటున్నారు. అసలు మోదీ తెలంగాణకు ఎందుకు వచ్చారు? ఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించడమే ఆయన ఉద్దేశమా? లేక వేరే ఏమైనా ఉందా? రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మునుగోడు ఫలితాన్ని పక్కనబెడితే… ‘కొంతమంది నిరాశతో.. హతాశులై, భయంతో, అంధ విశ్వాసంతో ఉదయం సాయంత్రం మోదీని అదేపనిగా తిడుతున్నారు. రకరకాల తిట్లు తిడుతున్నారు. ఇలాంటి విషయాలపై మీరు (బీజేపీ కార్యకర్తలు) పరేషాన్ కాకండి’ ఇవీ మోదీ తన కార్యకర్తలను ఉద్దేశించి అన్న మాటలు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో బీజేపీ బ్రోకర్లు కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిపోవడంతో కార్యకర్తలే కాదు.. రాష్ట్ర నాయకులూ పరేషాన్లో ఉన్న మాట నిజం.
ఎక్కే గడప దిగే గడపగా కోర్టుల మెట్లెక్కుతూ నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నవారు కొందరైతే, రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి ఆత్మరక్షణ చేసుకుంటున్న వారు ఇంకొందరు. రాష్ట్ర నాయకులను పట్టించుకోకుండా, కేంద్రమే ఈ ఆపరేషన్ కమల్‌కు పూనుకొన్నదని నిందితులు చెప్పడం, ఈ వీడియో దేశంలోని అందరు న్యాయమూర్తులకు చేరడం, సుప్రీంకోర్టు కూడా దీనిపై వ్యాఖ్యలు చేయడం, బీజేపీ టాప్-3తో పాటు ఇంకా అనేకమంది వ్యవహారాల ప్రస్తావన ఇందులో ఉండటం కమలం పార్టీ క్యాడర్‌ను కకావికలం చేస్తున్నది. బీజేపీ పునాదులనే కుదుపుతూ, కదుపుతూ సాగుతున్న ఈ వ్యవహారమే ప్రధాని బెదిరింపులకు అసలు కారణమని పరిశీలకు లు భావిస్తున్నారు. ‘అసలు ఇవాళ్టి పర్యటనే అనవసరంగా కనిపిస్తున్నది. రిమోట్‌తో ప్రారంభించడానికి ఢిల్లీ చాలదా? మోదీ ఒక నెపం పెట్టుకుని తెలంగాణ వచ్చారు. పూర్తిగా డీమోరలైజ్ అయి ఉన్న బీజేపీ నాయకులకు నేనున్నా అని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు’ అని ఒక సీనియర్ నాయకుడు అన్నారు. తిట్లను పెద్దగా పట్టించుకోకండి అని చెప్పడంలోని ఆంతర్యం, ఎమ్మెల్యేలకు ఎర స్కాం తీవ్రతను తగ్గించే ప్రయత్నమేనన్నారు.
ఇదేనా ప్రధాని మాట్లాడే భాష!
ఎందరో ప్రధానులు అనేక రాష్ర్టాలకు వెళ్లిన సందర్భాలున్నాయి. సాధారణంగా ఒక ప్రధాని స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి, సమస్యలు, తాము చూపే పరిష్కారాలు, కేంద్రం చేస్తున్న పనుల గురించి చెప్తారు. ప్రజలకు ఒక ఆశావహ దృక్పథం కల్పించే ప్రణాళికను ప్రకటిస్తారు. కానీ మోదీ ఉపన్యాసం మాత్రం దంగల్‌కు నేను రెడీ అన్నట్టుగా సాగిందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘అధికారిక కార్యక్రమాల కోసం రాష్ర్టానికి వచ్చిన ప్రధాని విమానాశ్రయంలో పార్టీ సభ పెట్టడం ఏమిటి? అక్కడ తనను తాను బీజేపీ కార్యకర్తగా అభివర్ణించుకొంటూ ప్రసంగించడం ఏమిటి? నర్మగర్భ బెదిరింపులకు దిగటం ఏమిటి? ఇదంతా చాలా దారుణంగా, దిగజారుడు వ్యవహారంగా ఉంది’ అని సీనియర్ పాత్రికేయుడొకరు విశ్లేషించారు. ‘నిన్నటిదాకా ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకడా? అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. స్వాగతం పలికితే ఏమయ్యేది? రెండో నిముషంలో ప్రధాని బీజేపీ వేదికమీదికి వెళ్లి విమర్శలు గుప్పించేవారు. ఇలాంటి వ్యవహారశైలి ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి నుంచి స్వాగతాన్ని ఎలా ఆశించగలరు?’ అని సీనియర్ కాలమిస్టు ఒకరు ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి భాష, వ్యక్తీకరణ, అందులోని సందేశంపై కూడా విమర్శకుల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆయన దీన్ని ఒక సందర్భంగా వాడుకోవాలనుకున్నట్టున్నారు. తెలంగాణపై లేని ప్రేమను, బీజేపీ కార్యకర్తలపై జరగని అరాచకాలను, తెలంగాణలో లేని అవినీతిని ప్రస్తావిస్తూ, వేరే ఏదో చెప్పాలనుకొన్నారు. ‘బస్తీమే సవాల్, చూస్కుందామంటే చూస్కుందాం’ అనే రీతిలో ఆయన ప్రసంగం సాగింది. యుద్ధం ఘోరంగా ఉంటుంది అంటూ గల్లీ దాదాలా ఎవరికి డాగులు వేశారు? ప్రధాని నోటి నుంచి రావాల్సిన మాటలేనా ఇవి? ఇంతపెద్ద దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ప్రస్తావించదగిన వేరే సమస్యలే లేవా?’ అని ఒక యువ పరిశీలకుడు ప్రశ్నించారు. ‘
మునుగోడు ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మోహరించింది అన్నారు మోదీ. మునుగోడులో బీజేపీ నుంచి జాతీయ స్థాయి నాయకులు మోహరించారు. మొత్తం రాష్ట్ర పార్టీయే అక్కడుంది. అంతెందుకు? ఇవాళ గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని, హోంమంత్రి, మొత్తం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ముఖ్యమంత్రులందరూ పాల్గొంటున్నారు. ఓడిపోయిన ఉప ఎన్నిక గురించి ఒక ప్రధాన మంత్రి ఇలా ప్రస్తావించాల్సిన అవసరం ఉందా? కచ్చితంగా ఆయన ఏదో ఆందోళనలో ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వారం అయిపోయినా మునుగోడు ఆయన్ను వెన్నాడుతున్నది. మునుగోడే కాదు; ఇంకేదో కూడా ఆయన మనసును తొలుస్తున్నది. తన ప్రణాళిక ఏదో విఫలమైనట్టుగా, తీవ్ర ఆశాభంగం ఏదో కలిగినట్టుగా! మోదీ ప్రసంగం ఎప్పటిలా లేదు.
నిలువునా నిరాశలో కూరుకుపోయిన వ్యక్తి, మరో మార్గాంతరం లేక, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి, లేస్తే మనిషిని కాను అని సవాల్ విసిరినట్టుగా ఉంది. తీవ్రమైన సమస్యలో చిక్కుకున్న వ్యక్తి, నీ సంగతి తర్వాత చూస్తా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తర్వాత తెలుస్తుంది అని చేతావనీ జారీ చేస్తున్నట్టుగా కనిపించింది’ అని వామపక్ష మేధావి ఒకరు అన్నారు. తెలంగాణలో మోదీ వ్యవహరించిన తీరు, వాడిన భాష గల్లా ఎత్తుకుని గల్లీలో తిరిగే కుస్తీ పహిల్వాన్ దేఖ్లేంగే అన్నట్టుగా ఉన్నదని ఒక టీవీ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు. ఒకసారి ఎన్నికలంటూ పూర్తయ్యాక, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీ కార్యకర్తలకు మంచి చేయండి.. ప్రజా సేవలో పాల్గొనండి అని చెప్పాలే కానీ.. వారిని రెచ్చగొట్టేలా, ఆవేశాన్ని పెంచేలా, ప్రత్యర్థి పార్టీలపై ఉసిగొల్పేలా మాట్లాడడం ఏమిటని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.
తెలంగాణలో ఏం జరుగుతున్నది..?ఆంధ్రాలో ఆరా తీసిన ప్రధాని మోదీ
విశాఖపట్నం, నవంబర్ 12: తెలంగాణలో ఏం జరుగుతున్నదంటూ ప్రధాని మోదీ ఏపీ నేతలతో ఆరా తీసినట్టు తెలిసింది. శుక్రవారం విశాఖకు చేరుకున్న ప్రధానమంత్రి.. రాత్రి అక్కడే బసచేశారు. శుక్రవారం సాయంత్రం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అనంతరం బీజేపీ నాయకులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగానూ, ఆ తర్వాతా.. తెలంగాణలో ఏం జరుగుతున్నదని, తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయని నాయకుల నుంచి ఆయన ఆరా తీశారని సమాచారం. తెలంగాణ రాజకీయాల గురించి సాధారణంగానే చర్చిస్తున్నట్టుగానే, వారి నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది.
ఖనిలో నల్ల జెండాలతో నిరసన..
‘గో బ్యాక్ మోదీ’.. అంటూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిరసనలు జరిగాయి. పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినప్పటికీ వెనక్కి తగ్గని నాయకులు ఆందోళనలు చేశారు. రామగుండంలోని ఫైవింక్లయిన్ కాలనీలో ప్రజలు తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. ప్రధాని పర్యటనను ఖండించారు.
సంకుచిత మనస్తత్వం..
విశాలమైన భారత దేశానికి ప్రధాని అంటే.. అదే స్థాయిలో విశాలమైన భావాలుండాలి. సంకుచిత మనస్తత్వంతో ఉండకూడదు. ఎన్నికలు ముగిసి.. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరువాత.. హుందాగా ప్రసంగించాలి. రాష్ర్టాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పెద్దన్నలా వ్యవహరించాలి. కానీ కుత్సితపు బుద్ధి, సంకుచిత మనస్తత్వంతో మాట్లాడటం.. ఆయన హోదాను ఆయనే చిన్నబుచ్చుకునేలా చేసినట్టని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.