హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. అన్ని స్థాయిల్లో ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నది. గ్రామ పంచాయతీల నుంచి జిల్లా ప్రజాపరిషత్తుల దాకా అన్ని స్థాయిల్లో పాలక వర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఆ కాపీలను నేరుగా ప్రధాని మోదీకి పంపి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నది. అప్పటికీ కేంద్రం వినకపోతే ఉగాది తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. ఈ నెల 21న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ.. రాష్ట్రంలో రైతులు పండించిన రెండు పంటల వడ్లు శాశ్వతంగా కొనేదాకా విశ్రమించని పోరాటాలకు పంజాబ్ తరహాలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్, నగర పాలక సంస్థ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశంలో పార్టీ అనుసరించే వ్యూహాన్ని ఆయన ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం (24న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సమాయత్తం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థలు, డీసీసీబీ, డీసీఎంఎస్, మార్కెట్ కమిటీలు శనివారం నుంచి నుంచి 31 వరకు ఆయా పాలకమండళ్లు సర్వసభ్య సమావేశాలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని పార్టీ నిర్దేశించింది.
ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధ్యక్షతన సమావేశమై కేంద్రం రైతుల ధాన్యం కొనాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తారు. ఆదివారం 594 మండల ప్రజాపరిషత్తులలో, 30న జిల్లా ప్రజాపరిషత్తులలో, 31న రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తారు.
ఈ నెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యాద్రాద్రికి వెళ్తారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులంతా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఈ నెల 21న తెలగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలకవర్గాల సమావేశాలు ఉండవని పార్టీ వర్గాలు తెలిపాయి.29న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిరసన ఈ నెల 28, 29 రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నిర్వహించే సమ్మెలో పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలపాలని పార్టీ నిర్ణయించింది.
తేది తీర్మాన వేదికలు
మార్చి 26 గ్రామ పంచాయతీలు
మార్చి 27 మండల ప్రజాపరిషత్తులు
మార్చి 28 యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి దర్శనం
మార్చి 29 కేంద్ర ఉద్యోగుల సమ్మె, టీఆర్ఎస్ సంఘీభావం
మార్చి 30 జిల్లా ప్రజాపరిషత్తుల సర్వసభ్య సమావేశం
మార్చి 31 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు
వడ్లు కొనుమని రాష్ట్ర మంత్రులు అడిగితే పీయూష్ గోయల్ అడ్డదిడ్డంగా మాట్లాడటం, చివరికి తెలంగాణ ప్రజలను అవమానపరుస్తూ నూకలు తినుమని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రం సాధించిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది. దీన్ని ఓర్వలేని కేంద్రం.. తెలంగాణను మళ్లీ నూకలు తినే స్థాయికి దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నది. ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ వరకు రాష్ర్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నరు. కేంద్రానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిందే.
– అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్
పీయూష్ గోయల్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాక పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. వర్షాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోయల్ వ్యాఖ్యలు పూర్తి దుర్మార్గం, అన్యాయంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయుమని చెప్పడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. ఏం తినాలో, ఎట్ల ఉండాలో, ఏ బట్టలు వేసుకోవాలో చెప్పే దుర్మార్గపు చర్యలను బీజేపీ విడనాడాలి, లేకపోతే ప్రజలు క్షమించరు.
– చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణ రైతులు, ప్రజలను కించపరిచేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన విధానం దారుణంగా ఉన్నది. గోయల్ మాటలను సీపీఎం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. గతంలో కొన్నది వాళ్లే, ఇప్పుడు కొనాల్సింది వాళ్లే. రా రైస్, బాయిల్డ్ రైస్ చర్చ కేవలం తప్పించుకోడానికి చేసేదే తప్ప మరొకటి కాదు. రైతులు ఏ రూపంలో ఇస్తే ఆ రూపంలో ధాన్యం కొనాలి. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపేలా వ్యవహరించడం సరికాదు.
– తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
గోయల్ మాటలు కేంద్ర ప్రభుత్వ పాశవికతకు నిదర్శనం. బియ్యం తింటున్న ప్రజలను పారాబాయిల్డ్ తినుమని, నూకలు తినుమని చెప్పడం అనాగరికమైన ఆలోచన. దేశ ప్రజల ఆహార పద్ధతుల కోసం నిలబడాల్సిన పాలకులు అందుకు భిన్నంగా నూకలు తినండి అని చెప్పడం దారుణం. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనితీరాలి.
– పశ్య పద్మ, జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా, అహంకారంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పంట కొనుగోలు బాధ్యత నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. రాజకీయ లబ్ధి పొందేందుకే చూస్తున్నారు తప్ప, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు.
– టీ సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం