హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీ డబ్బు పంపిణీ చేసి గెలవాలనుకుంటున్నదని, అందుకే పెద్ద ఎత్తున డబ్బు ను తరలిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఆరోపించారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, బీజేపీకి తప్పకుండా బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుల కేటాయింపుల్లో ఎన్నికల సంఘం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గిందని ప్రశ్నించారు. మునుగోడులో సోమవారం బీజేపీ నేత వద్ద కోటి రూపాయలు దొరికాయని, కమలనాథులు ఎన్నికల్లో గెలవడానికి డబ్బునే నమ్ముకున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల కమిషన్ అడుగడుగునా తనిఖీలుచేసి ఈ డబ్బు పంపిణీని నిలువరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని ఎన్నోసార్లు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశామని, అయినా టీఆర్ఎస్ మాటను ఈసీ పెడచెవిన పెట్టడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో టీఆర్ఎస్ విజ్ఞప్తిపై కొన్ని గుర్తులను తొలగించారని, ఇప్పుడు మళ్లీ ఆ గుర్తు లు కేటాయించారని, ఇది ఎవరి ఒత్తిడితో జరిగిందని ప్రశ్నించా రు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని భానుప్రసాద్ మండిపడ్డారు. కేంద్రమంత్రులు సహా బీజేపీ నేతలంతా ఫేకుడురాయుళ్లుగా మారారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముందుగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏంచేశారో చెప్పి మునుగోడులో హామీలివ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రతిష్ఠను మంట గలుపుతున్నారని, ఆమె ఏమి మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ ఏం చేస్తున్నదో అకడి ప్రజలకు తెలుసునని చెప్పారు. తాను యూపీలో 150 కిలోమీటర్లు ప్రయాణించడానికి 6 గంటలు పట్టిందని, తెలంగాణలో ఆ పరిస్థితి ఉన్నదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు బేవకూఫ్ మాటలు బంద్ చేస్తే మంచిదని హితవుపలి కారు. బీజేపీ గురించి ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన విమర్శలను ఒకసారి పరిశీలించాలని చెప్పారు.