గజ్వేల్, జనవరి 17: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారంటూ గజ్వేల్ డివిజన్లోని ఆయా గ్రామాలకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు గజ్వేల్‌కు వచ్చి ఆర్డీవో చంద్రకళను కలిశారు. పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదంటూ వారు బయటకు వచ్చి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతులు బీ కిష్టయ్య, రవికంటి శ్రీను, బక్రొద్దీన్, భాస్కర్ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మాట తప్పినట్టు వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. చావడానికైనా సిద్ధమే కానీ సాగు భూములు మాత్రం ట్రిపుల్ఆర్కు ఇవ్వబోమని స్పష్టంచేశారు.
రాత్రి వేళల్లో 60 నుంచి 70 మంది అధికారులు పోలీసులతో తిరుగుతూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పీర్లపల్లి నుంచి బేగంపేట వరకు ఎకరాకు రూ.2 కోట్లు పలుకుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు మూడింతల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ఆర్ను 60 కిలోమీటర్ల వరకైనా పొడిగించి అలైన్మెంట్ మార్చాలని లేదా సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చిట్యాల వరకు ఉన్న జాతీయ రోడ్డు మార్గంలోనే ట్రిపుల్ఆర్ వేయాలని సూచించారు.