RRR | ఆమనగల్లు, తలకొండపల్లి: ఆమనగల్లు మండల పరిధిలోని మేడిగడ్డ తండా (గుడి తండా) గ్రామపంచాయతీలోని గుడి తండా సమీపంలో ట్రిపుల్ఆర్ మార్కింగ్ తండావాసుల గుండెల్లో మంటలు రేపుతున్నది. రింగు రోడ్డుకు మార్క్ పడింది మొదలు.. తండావాసులు తమ భూములు, ఇండ్లు పోతాయంటూ భయందోళనలకు గురవుతున్నారు. తండాలోకి కొత్తవారు ఎవరు వచ్చినా.. ట్రిపుల్ఆర్ గురించేనా? అంటూ ఆందోళనతో వాకబు చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు విషయమై గురువారం ‘నమస్తే తెలంగాణ’ బృందం తండాకు వెళ్లి గిరిజనులతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఒకరిద్దరితో మాట్లాడుతుండగానే తండావాసులు గుంపుగా వచ్చి.. ‘మా తండాకు ఎవరెవరో కొత్తవాళ్లు ఎందుకు వస్తున్నరు? వెళ్లిపోండి..! భూములు, ఇండ్లు అన్నీ పోతయ్. నెలరోజుల నుంచి తండాలో అందరం సరిగా నిద్ర కూడా పోతలేము’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడటానికి తండాకు ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలైన్మెంట్ గురించి రోజుకో కొత్త కథ చెప్తున్నారని అగ్రహం వ్యక్తంచేశారు.
సన్న, చిన్నకారు రైతులే అధికం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను మార్చడంతో ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల ప్రజలు, రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త అలైన్మెంట్లో అధిక శాతం సాగు భూములే ఉండగా.. అందులో సన్న, చిన్నకారు రైతుల భూములే అధికం. ఎకరం, రెండు ఎకరాలను సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న రైతులకే అలైన్మెంట్ మార్పుతో తీవ్ర నష్టం జరుగుతున్నది. ఆలైన్మెంట్ మార్పుతో భూస్వాములకు, పెద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగటం లేదని, గత ప్రభుత్వం ప్రతిపాధించిన అలైన్మెంట్ అందరికీ అమోదయోగ్యంగా ఉన్నది గుడితండావాసులు చెప్తున్నారు.
సర్వేల్లో ట్రిపుల్-ఆర్ కలకలం
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 19 (నమస్తే తెలంగాణ)/సర్వేల్: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలోని అనేక గ్రామాల్లో ఇప్పుడు కలకలం, కలవరం కొనసాగుతున్నది. పాత అలైన్మెంట్ ఎక్కడినుంచి వెళ్తుందనేది గతంలోనే రైతులకు తెలుసు. అందులో అత్యధికం ప్రభుత్వ భూములే. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదు కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను జరపడంతో అత్యధికంగా సన్న, చిన్నకారు రైతుల భూములే బలికానున్నాయి.
కొత్త అలైన్మెంట్ తమ భూముల నుంచి వెళ్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం సర్వేల్ గ్రామ పరిధిలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారులో భాగంగా సర్వే నిర్వహించారు. వాస్తవానికి గతంలో అక్కడికి దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోని కంకణాలగూడెం సమీపంలో మార్క్ చేశారు. కానీ ఇప్పుడు సర్వేల్-లింగారెడ్డిగూడెం మధ్యలోకి దాన్ని మార్చారు. దీంతో ఆ అలైన్మెంట్ వల్ల భూమిని కోల్పోవాల్సి వస్తుందనే భయంతో కొందరు రైతులు చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డికి ఫోన్ చేశారు.
గతంలో అలైన్‌మెంట్‌ను ఎందుకు మారుస్తున్నారు? అని సంప్రదిస్తే… అసలు ఆ సర్వే తమకు సంబంధం లేకుండానే జరుగుతున్నదని ఆర్డీవో సమాధానమివ్వడంతో రైతులు విస్తుపోయారు. అధికారులకు తెలిసే తాము సర్వే చేస్తున్నట్టు సర్వేబృందం చెప్తుండగా.. రెవెన్యూ అధికారులు మాత్రం తమకు అలాంటిదేమీ తెలియదని అంటున్నారు. కాగా దీనిపై ‘నమస్తే తెలంగాణ’ కూడా ఆర్డీవో శేఖర్‌రెడ్డికి ఫోన్ చేయగా.. ఆ సర్వేతో తమకు సంబంధంలేదని చెప్పారు. ఆ విషయాన్నే రైతులకు కూడా చెప్పానని సమాధానమిచ్చారు.
తండాలో నుంచి రోడ్డు పోతే ఎలా?
మేము కొన్ని తరాలుగా ఈ తండాలోనే ఉంటున్నం. ఉన్న కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నం. ట్రిపుల్ ఆర్ మార్క్‌ను తండా సమీపంలో వేయడంతో భూములు, ఇండ్లు కోల్పోతామని మా తండా భయపడుతున్నది. రెడ్ మార్క్ భయంతో అందరూ నిరాశలో ఉన్నరు. కొత్తవాళ్లు ఎవరైనా ఊరికి వస్తే ప్రజలు ఆందోళనకు గురవుతున్నరు. ప్రభుత్వం పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించి తండాను కాపాడాలె.
– ముడావత్ రాజు, గుడితండా (ఆమనగల్లు మండలం)
పేద ప్రజల పొట్ట కొట్టొద్దు
ఖానాపూర్‌లో నాకు ఎకరం ఆసైన్డ్ భూమి ఉన్నది. దానితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మార్కింగ్ నా భూమి పక్కనే వేసిండ్రు. ఉన్న ఒక్క ఎకరం భూమి కూడా రోడ్డులో పోతే మేమెట్ల బతాకాలె? మాలాంటి చిన్న రైతుల గురించి సర్కారు ఆలోచించాలెగదా!
– వెంకటయ్య. ఖానాపూర్ (తలకొండపల్లి మండలం)
తండాను కాపాడండి
ట్రిపుల్ ఆర్కు సంబంధించిన తండాకి అతి దగ్గరలో వేయడంతో భయంతో రోజులు గడుపుతున్నం. తండాలో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకును వెళ్లదీస్తున్నం. తండాకి ఎప్పుడు ఏ అధికారి వస్తడో, ఏం చెప్పి వెళ్తాడోనని అందరం భయపడుతున్నం. మార్క్ వేసినప్పటి నుంచి బాధపడని రోజు లేదు. ప్రతిరోజు చస్తూ బతుకుతున్నం.
– ముడావత్ సాలి, గుడితండా (ఆమనగల్లు మండలం)
మా బతుకులు ఆగమైతున్నయి
ఉన్న రెండు ఎకరాలు సాగు చేసుకుంటూ మేం బతుకుతున్నం. మా భూమి పక్కన ట్రిపుల్ ఆర్ రోడ్డుకు సంబంధించిన మారింగ్ వేయడంతో ఎకరం భూమిని నష్టపోతున్నం. ఉన్న కొద్దిపాటి భూమిలో రోడ్డేస్తే మేమెట్ల బతకాలె? భూమి పోతే కుటుంబాన్ని ఎట్లా పోషించాలె? రైతులకు నష్టం చేసే ఆలోచనను ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి
– బండారు పార్వతమ్మ, గర్విపల్లి
(తలకొండపల్లి మండలం)
పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలి
మా కుటుంబానికి గర్విపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో 20 ఎకరాల భూమి ఉన్నది. అందులో 6 బోర్లతో వ్యవసాయం చేసుకుంటున్నం. ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్‌మెంట్‌కు సంబంధించిన మార్కింగ్‌ను మా భూముల పక్కనే శారు. దీంతో దాదాపు 15 ఎకరాల భూమి నష్టపోతున్నం. అలైన్మెంట్ మార్పుతో మా కుటుంబానికి ఇబ్బందులు తప్పేలా లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపాదించిన పాత అలైన్‌మెంట్‌నే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి.
-తిరుమణి యాదయ్యగౌడ్, ఖానాపూర్ (తలకొండపలి ్లమండలం)
మా భూములు, మా ఇండ్లను రక్షించాలి
కొన్ని వందల ఏండ్లుగా మా తాతలు, తండ్రులు నివాసము ఊరిది. ట్రిపుల్ ఆర్ మార్కింగ్‌తో తండా మొత్తం పోతదనే షాక్ నుంచి ఇంకా బయటపడ్తలేం. భూములు, ఇండ్లు కోల్పోతే మా బతుకులు సాగేదెట్ల? ట్రిపుల్ఆర్ కొత్త అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మా భూములు, మా ఇండ్లను రక్షించాలి.
– ముడావత్ దశరథం, గుడితండా (ఆమనగల్లు మండలం)