RRR | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖ శనివారం టెండర్లను ఆహ్వానించింది. రూ.7,104.06 కోట్లతో 161.5 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేను నిర్మించాలని నిర్ణయించారు. ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో 5 ప్యాకేజీలుగా చేపట్టనున్న ఈ పనులను రెండేండ్లలో పూర్తిచేయాలని, ఐదేండ్లపాటు మెయింటెనెన్స్ కూడా చేయాల్సి ఉంటుందని టెండర్ నిబంధనల్లో స్పష్టం చేశారు.
టెండర్ల దాఖలుకు ఈ నెల 27 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 17న టెండర్లు తెరుస్తారు. ఆన్లైన్ పద్ధతిలో టెక్నికల్, ఫైనాన్స్ బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ బిడ్లో అర్హత సాధించిన సంస్థకు సంబంధించిన ఫైనాన్స్ బిడ్ను తెరుస్తారు. అంతిమంగా తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు పనులు దక్కుతాయి. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి తంగడపల్లి వరకు ట్రిపుల్ఆర్ ఉత్తర భాగాన్ని నిర్మించాలని నిశ్చయించిన విషయం విదితమే. భూసేకరణలో సమస్యల వల్ల ఈ టెండర్ల ప్రక్రియ చాలా ఆలస్యమైంది. ఇప్పటికీ ఇంకా 5% మేరకు భూసేకరణ చేయాల్సి ఉన్నది. యాదాద్రి, రాయగిరి ప్రాంతాల్లో భూసేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రహదారుల శాఖ టెండర్లు ఆహ్వానించడం గమనార్హం.
ట్రిపుల్ఆర్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగింది. హైదరాబాద్కు దాదాపు 50 కి.మీ. దూరంలో ఔటర్ రింగురోడ్డుకు సమాంతరంగా మరో రింగురోడ్డును నిర్మించాలని నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన అలైన్మెంట్ను రూపొందించి కేంద్రానికి పంపడంతో ఆమోదం కూడా లభించింది. భూసేకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధ వైఖరిని అవలంబించకుండా రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చేలా చర్యలు చేపట్టడంతో కొంత జాప్యం జరిగింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు బలవంతంగా భూసేకరణకు దిగింది. దీంతో యాదాద్రి, రాయగిరి, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించాలనుకుంటున్న ట్రిపుల్ దక్షిణ భాగం డీపీఆర్ (సమగ్ర ప్రాజక్టు నివేదిక) తయారీకి కన్సల్టెంట్లు ముందుకు రాలేదు. ఆ భాగం నిర్మాణం కోసం గతంలో రూపొందించిన అలైన్మెంట్లో మార్పులు చేసిన ప్రభుత్వం.. సంబంధిత డీపీఆర్ రూపకల్పన కోసం నవంబర్ 25న గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి, నెల రోజుల గడువు ఇచ్చింది. శనివారం ఆ టెండర్లను తెరిచేసరికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. దీంతో సోమవారం మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని ఆర్అండ్బీ అధికారులు నిర్ణయించారు.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని తమకు అనుకూలంగా నిర్మించుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని, అందుకే గతంలో రూపొందించిన అలైన్మెంట్ను మార్చారని విమర్శలున్నాయి. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగంపై సమగ్ర అధ్యయనం, భూసేకరణ, డీపీఆర్ తయారీ తదితర అన్ని అంశాలపై ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన ఈ కమిటీతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూడా భేటీలు నిర్వహించారు. అయినప్పటికీ డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్ల నుంచి స్పందన రాకపోవడం పలు అనుమానాలను రేపుతున్నది. ప్రభుత్వంపై భరోసా లేక కన్సల్టెంట్లు ముందుకు రాలేదా? లేక మరేదైనా కారణం ఉన్నదా? అనేది అంతుబట్టడంలేదు.