చౌటకూర్, నవంబర్ 21 : రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూనిర్వాసితుల నుంచి నిరసన సెగ ఎదురైంది. భూమికి భూమి లేదా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అధికారులను నిర్బంధించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ట్రిపుల్ ఆర్ శివంపేట గ్రామ శివారు భూముల్లోంచి వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ఇదివరకే భూ సేకరణ చేపట్టి సర్వే పనులు పూర్తిచేశారు. నోటీసులు ఇచ్చేందుకు చౌటకూర్ ఆర్ఐ ప్రమోద్‌కుమార్, జీపీవో ప్రవీణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ గ్రామానికి వచ్చారు. పంచాయతీ కార్యాలయంలో కూర్చుని భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.16 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందని, నోటీసులు తీసుకోవాలని సూచించారు. ఆగ్రహించిన రైతులు వారిని అదే కార్యాలయంలో ఉంచి గేటుకు తాళం వేశారు.
భూమికి భూమి లేదా ఎకరానికి రూ.కోటి పరిహారం చెల్లిస్తేనే భూములిస్తామని స్పష్టంచేస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎకరానికి రూ.75 లక్షలు చెల్లిస్తామని అందోలు-జోగిపేట ఆర్డీవో పాండు హామీ ఇస్తే అప్పట్లో సర్వే పనులకు సహకరించామని, ఇప్పుడు ఎకరానికి రూ.16 లక్షలు చెల్లిస్తామని మాటమార్చడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్డీవో పాండు వచ్చేదాక అధికారులను విడిచిపెట్టేది లేదని మొండికేశారు. విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్‌కుమార్ హుటాహుటినా శివంపేటకు చేరుకుని రైతులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పి అధికారులను విడిపించారు. ఆర్డీవో రైతులను ఫోన్లో మాట్లాడుతూ నష్టపరిహారం రెట్టింపు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి, ఎన్హెచ్ఏఐ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిషారమయ్యేలా చూస్తానని ఆర్టీవో హామీ ఇచ్చారు.